వైవిధ్యం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం కార్తీ. ఒకపక్క ‘ఖైదీ’ లాంటి సీరియస్ సినిమాలు చేస్తూనే, మరోపక్క ‘సత్యం సుందరం’ లాంటి ఫీల్ గుడ్ చిత్రాలతో మెప్పిస్తారు. అలాంటి కార్తీ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో జతకట్టబోతున్నారనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మ్యాడ్’ లాంటి కామెడీని చూపించిన దర్శకుడితో, కార్తీ లాంటి మెథడ్ యాక్టర్ సినిమా అంటే.. ఆ కిక్కే వేరుగా ఉండబోతోందనిపిస్తోంది.
KARTHI
సాధారణంగా కామెడీ సినిమాలు ఒక భాష నుండి మరో భాషకు వెళ్ళినప్పుడు ఆ మ్యాజిక్ మిస్ అవుతుందనే భయం ఉంటుంది. గతంలో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్, శివకార్తికేయన్‌తో చేసిన ‘ప్రిన్స్’ ప్రయోగం బెడిసికొట్టడమే ఇందుకు ఉదాహరణ. మన నేటివిటీ జోకులు పక్క రాష్ట్రం వాళ్లకు అర్థం కావు. మరి ఇప్పుడు కళ్యాణ్ శంకర్ రాసే ఆ కామెడీని, కార్తీ ఎలా ఓన్ చేసుకుంటాడు? తమిళ ఆడియన్స్‌కి అది ఎలా కనెక్ట్ అవుతుంది? అనేదే ఇప్పుడు అసలైన చర్చ.
అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కార్తీ జడ్జిమెంట్‌ని. ఆయన కథ ఒప్పుకున్నాడంటే అందులో యూనివర్సల్ అప్పీల్ కచ్చితంగా ఉంటుంది. కేవలం మాటల మీద కాకుండా, సిచువేషనల్ కామెడీ ఉంటేనే కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కాబట్టి కళ్యాణ్ శంకర్ చెప్పిన పాయింట్‌లో భాషకు అతీతమైన ఫన్ ఏదో ఉండే ఉంటుంది. లేదంటే కార్తీ అంత సులభంగా ఇలాంటి రిస్క్ తీసుకోరు.
మరోవైపు సితార నాగవంశీ ప్లానింగ్ కూడా గట్టిగానే ఉంది. అటు సూర్యని, ఇటు కార్తీని లాక్ చేసి కోలీవుడ్ మార్కెట్‌పై పట్టు సాధించాలని చూస్తున్నారు. ‘మ్యాడ్’ సినిమాతో యూత్ పల్స్ పట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఈసారి స్టార్ హీరో దొరికితే తన విశ్వరూపం చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ గనక సెట్ అయితే, అది అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఒక కొత్త రకం ఎంటర్టైనర్ అవుతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నా, ఈ కాంబినేషన్ ఐడియానే చాలా ఫ్రెష్‌గా ఉంది. మరి ఈ ‘మ్యాడ్’ స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.