కార్తికేయలో హీరోనే కాదు, విలన్ కూడా ఉన్నాడని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చూస్తే ఎవరైనా చెప్పొచ్చు. ఆ సినిమాలో కార్తికేయ విలనిజం కూడా అదిరిపోయిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత మళ్లీ విలనిజం వైపు చూడలేదు. ఈలోపు ఆయన అభిమానులకు గుడ్‌న్యూస్ అంటూ ‘వలిమై’ సినిమా అనౌన్స్ అయ్యింది. తమిళ సూపర్ స్టార్ అజిత్‌తో కార్తికేయ మళ్లీ విలన్‌గా మారాడు. అయితే ఈ సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుంది అనే వివరాలు మాత్రం అప్పుడు బయటకు రాలేదు. రేసింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుంది అని మాత్రం చెప్పారు.
తాజాగా ఈ సినిమా గురించి కార్తికేయ మాట్లాడాడు. సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుంది, హీరో – విలన్‌లో తను గమనించిన అంశాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో విలన్ పాత్ర కంటే, హీరో పాత్రతోనే ఎక్కువ నటనను ప్రదర్శించొచ్చు అని కూడా అంటున్నాడు. హీరో, విలన్… ఇలా ఏ పాత్ర చేసినా కెమెరా ఆన్ చేశాక నటనలో పెద్దగా తేడాలుండవు. హీరో క్యారెక్టర్ కన్నా విలన్ పాత్రనే ఎక్కువ ఆస్వాదించా అని చెప్పాడు కార్తికేయ. హీరో పాత్రలకు కొన్ని పరిమితులు ఉంటాయి, అదే విలన్ పాత్రలకు ఉండవు. ‘వలిమై’లో నేను పోషించిన సైకో విలన్ లాంటి పాత్రల్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశా అని చెప్పాడు కార్తికేయ.
హీరోగా నటించేటప్పుడు మార్కెట్ లెక్కలు, సినిమా ప్రమోషన్లు… ఇలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఒత్తిడి ఉంటుంది. విలన్ విషయంలో ఇలాంటి ఒత్తిడులుండవు అని చెప్పుకొచ్చాడు కార్తికేయ. ఇదంతా వింటుంటే కార్తికేయకు విలన్‌గా నటించడమంటేనే ఇష్టం అనేలా ఉంది కదా. ఇలాంటి హీరో లుక్ విలన్స్‌కు సినిమాల్లో మంచి క్రేజే ఉంటుంది. మరి కార్తికేయ ఏం చేస్తాడో చూడాలి. అయితే ఇప్పుడు వేరే సినిమాలు హీరోగా చేస్తున్నాడు అనుకోండి.
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా చూసి ‘వలిమై’ చిత్ర బృందం సంప్రదించారట. ‘అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నాం. అందులో పవర్‌ఫుల్ విలన్ పాత్ర ఉంది. మీ ‘ఆర్‌ఎక్స్100’ పిక్చర్ చూశాను. మీ లుక్, ఫిజిక్ బాగున్నాయి . ఈ పాత్ర మీకు బాగా కుదురుతుంది అనుకుంటున్నాం. మీరు చేస్తారా?’ అని దర్శకుడు వినోద్ అడిగారట. ‘గ్యాంగ్‌లీడర్’లో చేసిన విలన్ పాత్రలో కన్నా ‘వలిమై’లో ఎక్కువ షేడ్స్ ఉన్నాయి అనిపించాయట. అందులోనూ అజిత్‌కు విలన్ కాబట్టి.. నా పాత్ర బలంగా తీర్చిదిద్దుతారు అనిపించిందట కార్తికేయకి. అందుకే సినిమా ఓకే చేశా అని కార్తికేయ చెప్పారు.