కేజీఎఫ్

“కె.జి.ఎఫ్” ఈమధ్యకాలంలో బాగా హల్ చల్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ & ప్రోమోస్ అంచనాలను విపరీతంగా పెంచేశాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈస్థాయి చిత్రాన్ని ఎక్స్ పెక్ట్ చేయని మూవీ లవర్స్ అసలు సినిమాలో ఏముంటుందా? అని థియేటర్ల ముందు క్యూ కట్టారు. యాక్షన్ ప్యాక్డ్ మాస్ మసాలా ఫిలిమ్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ : ఓ పదిహేనేళ్ళ యువతికి పుట్టిన కుర్రాడు పవన్ (యష్). కటిక పేదరికంలో పుట్టిన యష్ తల్లిని కాపాడుకోలేక తాను పుట్టిన ఊరు వదిలి ముంబై వెళ్ళిపోతాడు. తన తల్లి చనిపోతూ “ఎలాగైనా బ్రతుకు కానీ.. డబ్బున్నవాడిగానే చావు” అని చెప్పిన మాటను బలంగా గుర్తుపెట్టుకున్న పవన్ తన పేరును రాకీగా మార్చుకుని ముందుగా ముంబైను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకుంటాడు. కానీ.. దునియాను ఏలాలి అనే టార్గెట్ పెట్టుకున్న రాకీకి ముంబైపై పట్టు సరిపోదు.. అంతకుమించిన పవర్ కావాలి.. అందుకే మనిషి కనీసం చూడ్డానికి కూడా భయపడే “కె.జి.ఎఫ్” గనుల్లోకి ఆ గనిని, గనిలోని జనాల్ని శాసిస్తున్న గరుడను చంపడం కోసం ఆ గనిలోకి ఎంటర్ అవుతాడు. నిశాచరులు సైతం నిలబడేందుకు భయపడే ఆ గనిలో రాకీ ఎలా నిలదొక్కుకున్నాడు? ఆ గనిపై ఆధిపత్యం చలాయించగలిగాడా? అనేది “కె.జి.ఎఫ్” పార్ట్ 1 కథాంశం.

నటీనటుల పనితీరు : ఎదురులేని బలవంతుడిగా యష్ నటన, హావభావాలు, ఆహార్యం అదిరిపోయాయి. మాస్ హీరో అంటే వీడేరా అని ప్రేక్షకులందరూ అనుకొనేలా ఉన్నాడు యష్. ఆ కళ్ళల్లో రౌద్రాన్ని ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవ్వడం ఖాయం.

సినిమాలోని క్యారెక్టర్స్ లో మైనస్ ఉంది అంటే అది హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాత్రమే. అమ్మడు అందంగానూ లేక నటనా బాగోక సినిమాకి దిష్టి చుక్కలా మారింది.

సాధారణంగా సినిమాలో ఒక అయిదారుగురు విలన్స్ మాత్రమే ఉంటారు. కానీ.. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టులకంటే ఎక్కువమంది విలన్స్ ఉన్నారు. అందరూ విలనిజాన్ని వీరలెవల్లో పండించినవారే. ఒక్కొక్కొక్క విలన్ ను చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

సాంకేతికవర్గం పనితీరు : కెమెరా వర్క్ & ఫైట్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణలు. భువన్ గౌడ తన కెమెరా వర్క్ తో ఒక రస్టిక్ వరల్డ్ ను క్రియేట్ చేస్తే.. ఉరమాస్ ఎలివేషన్స్ & యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్ ను విందు భోజనంలా మారాయి. సినిమా మొత్తంలో కనీసం ఒక 20కి పైన మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కో రేంజ్ అన్నమాట. బి, సి సెంటర్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మాస్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎవ్వరైనా ఈ చిత్రాల్ని ఎంజాయ్ చేయగలరు.

ఎడిటింగ్ ఈ సినిమాకి పెద్ద మైనస్. యష్ చేసే ఫైట్స్ మాత్రమే కాదు.. భారీ ప్లానింగ్ తో జరిగిన క్లైమాక్స్ సీక్వెన్స్ లో కూడా ఒక్కటంటే ఒక్క హైలైట్ సీన్ కూడా సరిగా ఆడియన్స్ మైండ్ లో రిజిష్టర్ అవ్వలేదు. ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో భాగం ఉండడం, ఆ సీక్వెల్ కి ఇచ్చిన ఎలివేషన్ కూడా పీక్స్ లో ఉండడంతో చాప్టర్ 2 ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ రాసుకొన్న కథ, అందుకు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, కథను ముందుకు తీసుకెళ్లిన విధానం.. ఇలా అన్నీ వీరలెవల్లో ఉన్నాయి. కాకపోతే.. స్క్రీన్ ప్లే ఇంకాస్త క్లారిటీగా ఉంటే ఇంకాస్త ఎక్కువమందికి రీచ్ అవుతుందీ చిత్రం.

అద్భుతమైన కంటెంట్ ఉండీ.. సరైన ప్రమోషన్స్ లేక జనాలకి రీచ్ అవ్వలేకపోతున్న సినిమా ఇది. ఇప్పటికైనా యష్ & టీం సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే సూపర్ హిట్ అయ్యే సత్తా “కె.జి.ఎఫ్” చిత్రానికి పుష్కలంగా ఉంది.

విశ్లేషణ : మాస్ సినిమా అనే పదానికి సరికొత్త నిర్వచనంలా నిలిచిన చిత్రం “కె.జి.ఎఫ్”. సినిమాలోని ఎలివేషన్స్ సీన్స్ & క్లైమాక్స్ చాలు మాస్ ఆడియన్స్ సంతుష్టులవ్వడానికి. చిన్న చిన్న మైనస్ లు ఉన్నాయి కానీ.. వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ వీకెండ్ హ్యాపీగా ఫ్రెండ్స్ తో చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం “కె.జి.ఎఫ్”.

రేటింగ్ : 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus