ఖైదీ నంబర్ 150

  • April 28, 2017 / 06:27 AM IST

మూడు దశాబ్ధాల పాటు తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందిన చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం “ఖైదీ నంబర్ 150”. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా సరసాలాడిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ “కొణిదెల ప్రొడక్షన్స్” ద్వారా నిర్మించడం విశేషం. తమిళ సూపర్ హిట్ సినిమా “కత్తి”కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. తమిళ వెర్షన్ స్థాయిలో తెలుగు “ఖైదీ నంబర్ 150” సూపర్ హిట్ అవుతుందా? మెగాస్టార్ రీఎంట్రీకి ఇది పర్ఫెక్ట్ ఫిలిమా కాదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి!

కథ : దొంగతనాలు, లూటీలు చేసుకొంటూ సగానికి పైగా జీవితాన్ని జైల్లోనే గడిపేసిన కత్తి శీను (చిరంజీవి)కి అనుకోకుండా “శంకర్” అనే అచ్చు తనలాగే ఉండే వ్యక్తి స్థానంలో సంఘంలో గౌరవప్రదమైన సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయితే.. తాను అనుకొన్నదానికంటే శంకర్ చాలా గొప్పవాడని తెలుసుకొన్న శీను తన పద్ధతిని మార్చుకొని శంకర్ పూర్తి చేయలేని మంచి పనులను తన శక్తియుక్తులను వినియోగించి పూర్తి చేస్తుంటాడు. ఈ పోరాటంలో శీనుకు ఎదురైన సమస్యలేటువంటివి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? శీను స్థానంలో చిక్కుకుపోయిన శంకర్ పరిస్థితి ఏమయ్యింది? అనేది “ఖైదీ నంబర్ 150” సినిమా చూసి తెలుసుకోవాల్సిన సమాధానాలు!

నటీనటుల పనితీరు : ఈ సినిమా ప్రమోషన్స్ లో “బాస్ ఈజ్ బ్యాక్” అనే పదాన్ని ఎక్కువగా ఎందుకు ఉపయోగించారో సినిమాలో చిరంజీవిని చూస్తే అర్ధమవుతుంది. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్ సీన్స్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లోనూ తనదైన మార్క్ వేశాడు మెగాస్టార్. ఎమోషనల్ సీన్స్ లో కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించిన తీరు ఆయన సీనియారిటీకి నిదర్శనం. కాజల్ కి కథానాయికగా సినిమాలో పెద్దగా నిడివి లభించలేదు. కనిపించినంతలో అందాలతో కనువిందు చేసింది.

తరుణ్ అరోరా క్యారెక్టర్ కి వెయిట్ లేదు, దాంతో అతడి క్యారెక్టర్ ద్వారా విలనిజం అనుకొన్న స్థాయిలో పండలేదు, ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో డబ్బింగ్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. అలీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు, బ్రహ్మానందం-రఘుబాబుల కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ఫస్టాఫ్ లో కాస్త నవ్వించినా.. సెకండాఫ్ లో వేగాన్ని తగ్గించాయే తప్ప పెద్దగా అలరించలేదు. ఇక పోసాని-అదుర్స్ రఘుల కామెడీ ఎపిసోడ్ ఒక రెండు నిమిషాల వరకూ బాగానే ఉన్నా.. మరీ ఎక్కువగా సాగదీయడంతో బోర్ కొట్టింది.

సాంకేతికవర్గం పనితీరు : చిరంజీవి ఎంట్రీ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ లలో వాడిన రత్నవేలు వాడిన స్లో మోషన్ షాట్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఇక లైటింగ్, ఫ్రేమ్స్ వర్క్ లో తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొన్నాడు రత్నవేలు. చిరంజీవి మరింత అందంగా, యంగ్ గా ప్రెజంట్ చేసిన తీరు అభిమానులను విశేషంగా అలరిస్తుంది. దేవిశ్రీప్రసాద్ బాణీలు బాగున్నాయి. “అమ్మడు కుమ్ముడు, రత్తాలు” సాంగ్స్ పిక్చరైజేషన్ అద్భుతంగా ఉండడంతో.. ఆడియన్స్ ఈ పాటల్ని, ఆ పాటల్లో చిరు డ్యాన్స్ మూమెంట్స్ ను తెగ ఎంజాయ్ చేస్తారు.

సాయిమాధవ్ బుర్రా-వేమారెడ్డి సంయుక్తంగా సమకూర్చిన సంభాషణలు ఆలోచింపజేయడంతోపాటు అలరించాయి. ముఖ్యంగా సింగిల్ లైన్ పంచస్ మాస్ ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. రామ్ చరణ్ నిర్మాణ విలువలు సినిమాకి మరింత వేల్యూను యాడ్ చేశాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను, ఆయన డ్యాన్స్ లోని గ్రేస్ ను వినాయక్ చాలా చక్కగా వినియోగించుకొన్నాడు. అయితే.. స్క్రీన్ ప్లే పరంగా వినాయక్ చేసిన మార్పులు మాత్రం సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ ను మార్చేసిన తీరు అందరికీ నచ్చదు. అయితే.. మెగా అభిమానులకు మాత్రం విందు భోజనంలా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో వినాయక్ వందశాతం విజయం సాధించాడు.

విశ్లేషణ : గత పదేళ్ళలో మాస్ సినిమాలు ఎన్ని వచ్చినా, ఎందరు హీరోలు తమ డ్యాన్సులతో మైమరపించినా.. చిరంజీవి తరహా మాస్ డ్యాన్సులు, ఆయన శైలి మేనరిజమ్స్ ను తెలుగు సినిమా ప్రేక్షకులు పూర్తి స్థాయిలో మిస్ అయ్యారు. ఆ లోటును భర్తీ చేసే సినిమా “ఖైదీ నంబర్ 150”. చిరంజీవి గ్రేస్ డ్యాన్స్ మూమెంట్స్, ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా తెరకెక్కిన ఈ చిత్రం మెగా అభిమానులకు విందు భోజనం, సగటు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటిది.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus