ఇండియన్ సినిమాలో ఒకప్పుడు అస్సలు లేని.. ఇప్పుడు పుష్కలంగా ఉన్న అంశం.. సినర్జీ. అంటే ఒక ఇండస్ట్రీ నుండి మరో ఇండస్ట్రీకి వచ్చి నటించడం. ఇలా కాంబినేషన్‌లు కొన్ని రెమ్యూనరేషన్‌కి, ఇంకొన్ని స్నేహానికీ జరుగుతుంటాయి. అంటే ఫ్రెండ్ అడిగాడని చిన్న పాత్రలు వేయడం, తిరిగి అదే ఫ్రెండ్‌ని అడిగి తన సినిమాలో చిన్న పాత్ర చేయించడం. ఒకప్పుడు బాగా జరిగిన ఈ సంప్రదాయం.. ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా వైబ్ పుణ్యమా అని తెగ జరుగుతున్నాయి. అయితే ఇది కొన్ని పరిశ్రమలకే, కొంతమందికే అనే చర్చ మొదలైంది. దీనికి కారణం ప్రముఖ కన్నడ నటుడు సుదీప్.
కిచ్చా సుదీప్ నటించిన ‘మార్క్’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో సౌత్, ఇతర సినిమా పరిశ్రమల మధ్య సహకారం గురించి మాట్లాడాడు. సౌత్ స్టార్లు ఇతర భాషల సినిమాల్లో కామియోలు, చిన్న పాత్రలు చేస్తున్నారు. కానీ, ఇతర పరిశ్రమల నటులు సౌత్ సినిమాల్లో అలా నటించడానికి ముందుకు రావడం లేదు అని అన్నారు. తాను కొంతమంది నటులను అడిగినా వాళ్లు ఒప్పుకోలేదు అని అన్నాడు.
ఇప్పటికైనా సినిమా పరిశ్రమల మధ్య పరస్పర సహకారంపై చర్చ జరగాలి అని అన్నారు. తానైతే డబ్బు కంటే స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. అందుకే సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ సినిమాలో నటించానని, ఆ సినిమాను డబ్బుల కోసం చేయలేదు అని చెప్పాడు. సల్మాన్ అడిగాడని ఆ సినిమాలో, విజయ్ కోసం ‘పులి’ సినిమాలో నటించాను. తెలుగులో చేసి ‘ఈగ’ గురించి మాట్లాడుతూ ఆ సినిమా స్క్రిప్ట్ ఆకట్టుకోవడం వల్ల నటించానని చెప్పాడు. కానీ ఇలా కన్నడ సినిమా పరిశ్రమకు వచ్చి ఎవరూ నటించడం లేదు అని చెప్పాడు సుదీప్. చూడాలి మరి ఇప్పటికైనా ఇతర పరిశ్రమల నటులు రియాక్ట్ అవుతారేమో.