హిట్‌లో ఉన్న హీరోతో సినిమా చేయడం దర్శకుడికి ఓ రకమైన ఒత్తిడిని కలిగిస్తే.. ఫ్లాపుల్లో ఉన్న హీరోతో సినిమా చేయడం అంటే మరో రకం ఒత్తిడి ఉంటుంది. ఇందులో రెండో రకం చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే హిట్‌ల్లో ఉన్న హీరోతో సినిమా అంటే ఓపెనింగ్స్, వైబ్ డిఫరెంట్‌గా ఉంటాయి. అదే ఫ్లాప్స్‌లో ఉన్న హీరోకు సరైన ఓపెనింగ్స్, వైబ్ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. ప్రచార చిత్రాలకు ఊహించని హైప్ క్రియేట్ చేయాలి. ప్రస్తుతం ఈ బాధ్యత కిషోర్ తిరుమల భుజాన ఈ బాధ్యతలు పడ్డాయి.
టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజకు చాలా ఏళ్లుగా పేరుంది. రీసెంట్‌గా ఆయన కెరీర్ చూస్తే మూడేళ్లయింది ఆయనకు హిట్ వచ్చి. ముఖ్య పాత్రలో అయితే రెండేళ్ల క్రితం విజయం అందుకున్నారు. ఇప్పుడు రవితేజ వరుస సినిమాలు చేస్తున్నా సరైన విజయం కాదు కదా.. అసలు విజయమనే మాటే వినిపించడం లేదు. ఈ ఏడాది ‘మాస్ జాతర’ అంటూ వాయిదాలు పడుతూ పడుతూ వచ్చి ఇబ్బందికర ఫలితమే అందుకుంది.
దీంతో రవితేజ కెరీర్‌లో మళ్లీ 2017 నుండి 2021 పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పాలి. అప్పుడు కూడా ఇలా వరుస సినిమాలు పోయాక ‘క్రాక్’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు అలాంటి విజయం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడు కిషోర్ తిరుమల మీద పడింది. ఆయన రవితేజ హీరోగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నారు (ఈ టైటిల్ త్వరలో చెబుతారనుకోండి). ఈ సినిమా విజయం రవితేజకు అత్యవసరం అయిపోయింది.
సినిమా రూమర్డ్ టైటిల్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వినోదాత్మకంగా నడిపించబోతున్నారు అని అర్థమవుతోంది. పాపులర్ టీవీ సీరియల్స్ పాటలను రీమిక్స్ చేయించి సినిమాలో వాడుతున్నారు అని ఓ వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. అలాగే ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో రవితేజ కనిపిస్తాడట. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్ అయి ఉన్నారు. ఇదంతా చూస్తుంటే కిషోర్ తిరుమలకు పెద్ద చిక్కొచ్చి పడిందే అనిపిస్తోంది.