కిట్టు ఉన్నాడు జాగ్రత్త

రాజ్ తరుణ్ కథానాయకుడిగా, మలయాళ ముద్దుగుమ్మ అను ఎమ్మాన్యూల్ హీరోయిన్ గా “దొంగాట” ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కిట్టు ఉన్నాడు జాగ్రత్త”. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో కుక్కల్ని కిడ్పాప్ చేసే “పెట్ కిడ్నాపర్”గా నటించడం విశేషం. అసలు మన హీరోకి కుక్కల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారు? అనేది తెలియాలంటే సమీక్ష చదవాల్సిందే..!!

కథ : కిట్టు (రాజ్ తరుణ్) జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి కాస్ట్లీ ఏరియాల్లో బాగా డబ్బున్న వారి కుక్క పిల్లలను కిడ్నాప్ చేసి 30 నుంచి 50 రూపాయల వరకూ డబ్బులు గుంజుతుంటాడు. అయితే.. హీరోగారు ఇలా చీప్ గా కాస్టీ కుక్కల్ని కిడ్నాప్ చేయడానికి వెనుక ఒక పెద్ద కథ, ఆ కథలో బోలెడన్ని మలుపులు, ఆ మలుపులకు మళ్ళీ కొన్ని మెలికలు కలగలిస్తే “కిట్టు ఉన్నాడు జాగ్రత్త”. అసలా కథేమిటి, ఆ కథలో ఉన్న మలుపులేమిటి, ఆ మలుపులకు ఉన్న మెలికలేమిటి అనేది తెలియాలంటే “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమా చూడాల్సిందే..!!

నటీనటుల పనితీరు : రాజ్ తరుణ్ ఎప్పట్లానే తనదైన ఎనర్జీతో కిట్టు పాత్రను పండించాడు. ప్రవీణ్, సుదర్శన్ లతో కలిసి వేసిన కామెడీ పంచస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరిస్తాయి. అను ఎమ్మాన్యూల్ ఇంట్రడక్షన్ సీన్ పిక్చరైజేషన్ బాగుంది. అమ్మాయి కూడా మరీ బక్క చిక్కిన నాటు కోడిలా కాక.. కండపట్టిన టర్కీ కోడిలా మంచి పర్సనాలిటీతో, అక్కడక్కడా అందాలను చూపించీచూపించనట్లుగా చూపిస్తూ ఊరించి ఆకట్టుకొంది.

“జై చిరంజీవ” తర్వాత చాలా ఏళ్ల అనంతరం బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ మళ్ళీ డాన్ పాత్రలో మెప్పించాడు. డ్రెస్సింగ్, యాటిట్యూడ్ వరకూ పర్లేదు కానీ.. డబ్బింగ్ అస్సలు సింక్ అవ్వకపోవడం కాస్త మైనస్ అనే చెప్పుకోవాలి. రేచీకటి కారణంగా రాత్రిపూట చూడలేక ఆ విషయాన్ని కవర్ చేసుకోవడం కోసం గొర్రెపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే పాత్రలో పృధ్వీ కడుపుబ్బ నవ్వించాడు. అయితే.. పృధ్వీ చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ క్లాస్ ఆడియన్స్ ను కాస్త ఇబ్బందిపెట్టే అవకాశాలున్నాయి. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ పాత్రలో నాగబాబు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. దొంగబాబాగా పృధ్వీ కూడా ఓ మోస్తరుగా అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు : అనూప్ రూబెన్స్ బాణీలు వినసోంపుగా ఉన్నాయి. మెలోడీ సాంగ్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ నైట్ షాట్స్ మినహా పర్వాలేదనిపించుకొనే స్థాయిలో ఉంది. శ్రీకాంత్ విస్సా రాసిన కథలో ట్విస్టుల సంఖ్య మరీ ఎక్కువయ్యింది. చిక్కుముడులు వేయడం కంటే.. వాటిని విడదీయడం చాలా ముఖ్యమైన అంశమన్న విషయాన్ని రచయిత మరవడం గమనార్హం.

“ఖైదీ నంబర్ 150, శాతకర్ణి” చిత్రాలకు సంభాషణలు సమకూర్చి సంక్రాంతి రైటర్ గా పేరు తెచ్చుకొన్న సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రంలో రాసిన సెంటిమెంట్, ఎమోషనల్ డైలాగ్స్ వరకూ పర్లేదు కానీ.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త శృతి మించాయి. వంశీకృష్ణ స్క్రీన్ ప్లేలో మెలికలు చాలా అంటే చాలా ఎక్కువయ్యాయి. ప్రతి విషయానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడో లేక బ్యాక్ స్టోరీనో చూపించాలనుకోవడం మైనస్ గా మారింది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ను కన్ఫ్యూజన్ కామెడీతో ఎండ్ చేద్దామని చేసిన ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఫలించలేదనే చెప్పాలి. వందల సినిమాల్లో చూసేసిన హీరో గ్యాంగ్ వర్సెస్ విలన్ గ్యాంగ్ గన్ ఫైర్ ఎపిసోడ్ మరీ రోతలా అనిపించింది.

విశ్లేషణ : కన్ఫ్యూజన్ కామెడీ అనే జోనర్ అన్నీ భాషల్లోనూ ఇప్పటివరకూ మంచి రిజల్టే తెచ్చిపెట్టాయి. కథలో మరీ ట్విస్టులు ఎక్కువైతే తప్ప ఈ జోనర్ సినిమాలు ఫ్లాపైన దాఖలాలు చాలా తక్కువ. “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” కూడా ఈ తరహా చిత్రమే. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ బాగున్నా కథలో మెలికలు మరీ ఎక్కువవ్వడంతో చివర్లో కాస్త బోర్ కొట్టిస్తుంది కానీ.. ఓవరాల్ గా ఫర్వాలేదనిపించే కామెడీ ఎంటర్ టైనర్ ఇది.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus