సినిమా బాగుంటే ఎడిటింగ్ టైమ్ లో లేచిపోయిన సన్నివేశాలను యాడ్ చేయడం, బాగోలేకపోతే రన్ టైమ్ తగ్గించడం కోసం సన్నివేశాలను డిలీట్ చేయడం అనేది అనాదిగా వస్తున్న పద్ధతి. అయితే.. ఇటీవల కాలంలో సినిమా బాగుంటే రన్ టైమ్ ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. “రంగస్థలం, అర్జున్ రెడ్డి” సినిమాల నిడివే అందుకు నిదర్శనం. తాజాగా ఆ లిస్ట్ లో “భరత్ అనే నేను” కూడా యాడ్ అయ్యింది. ఈ సినిమా కూడా దాదాపు మూడు గంటల నిడివితో విడుదలైంది. కంటెంట్ అందరికీ కనెక్ట్ అవ్వడంతో సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ చేసేశారు.
అందుకే.. త్వరలోనే సినిమాలో ఒక కీలకమైన సన్నివేశాన్ని యాడ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. సినిమా కోసం భారీ వ్యయంతో ఒక హోలీ ఫైట్ సీన్ ను షూట్ చేశారట. అయితే.. విడుదల సమయంలో రన్ టైమ్ కి భయపడి ఆ సీన్ ని డిలీట్ చేసేశారు. అయితే.. ఇప్పుడు సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొని సదరు యాక్షన్ బ్లాక్ ను యాడ్ చేయనున్నారట. కొరటాల మొదటి చిత్రం “మిర్చి” విషయంలోనూ రైన్ ఫైట్ ను సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత యాడ్ చేశారు. ఇప్పుడు “భరత్ అనే నేను” విషయంలోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అవుతుండడంతో కొరటాల ఫ్యాన్స్ తోపాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఫైట్ ను యాడ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.