ఫిల్మ్ నగర్లో ప్రస్తుతం అందరూ డైరక్టర్ బోయపాటి శ్రీను గురించే మాట్లాడుకుంటున్నారు. భద్ర, సింహ, లెజెండ్, సరైనోడు వంటి హిట్ చిత్రాలు తీసిన ఈ దర్శకుడి ప్రతిభను అనుమానిస్తున్నారు. టేకింగ్ లో ప్రత్యేక శైలి ఉన్నా కథ, మాటలు రాయడంలో వీక్ అని చెప్పుకుంటున్నారు. రచయితగా అనేక సినిమాలకు పనిచేసి, దర్శకుడిగా మారి హ్యాట్రిక్ అందుకున్న కొరటాల శివ ఆరోపణలతో బోయపాటి ఈ విమర్శలను ఎదుర్కొంటున్నారు.
రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో శివ మాట్లాడుతూ “నేను అనేక సినిమాలకు కథ, మాటలు రాసాను. కొన్ని సినిమాల్లో నాకు క్రెడిట్ ఇవ్వలేదు. అప్పుడు చాలా బాధ వేసేది. సింహ విషయంలోనూ అదే జరిగింది. ఆ చిత్రానికి కథ, మాటలు నేనే రాసాను. కానీ ఎదో ఒకటే ఎంచుకోమని బోయపాటి అడగగా బాధతో ఏమి వద్దని చెప్పాను” అని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ కసితోనే డైరక్టర్ అయ్యానని వెల్లడించారు. దీంతో ఇండస్ట్రీలో దుమారం రేగింది. టాలీవుడ్ లో రచయితలకు విలువ దక్కడం లేదనే ఆరోపణలకు కొరటాల శివ వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. బోయపాటి అతనిపై వచ్చిన ఆరోపణలకు ఏవిధంగా స్పందిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.