2016లో కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించగా కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం “కోటిగబ్బా 2”. 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సుదీప్ సరసన నిత్యామీనన్ నటించిన ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఆ చిత్రాన్ని తెలుగులో “కోటికొక్కడు”గా డబ్బింగ్ చేసి గతేడాది రిలీజ్ చేద్దామనుకొన్నారు. కానీ పలు కారణాల వల్ల అది కుదరలేదు, దాంతో ఇవాళ (మార్చి 9) ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్యూర్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఏమేరకు నచ్చుతుందో చూద్దాం..!!
కథ : సత్య (సుదీప్) ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అందరితో మంచిగా నడుచుకుంటూ అందరికీ మంచి చేయడం కోసం పరితపించే వ్యక్తి. అయితే.. పోలీసులు ఉన్నట్లుండి సత్యను ఒక అరెస్ట్ చేసి.. 120 కోట్ల రూపాయల నల్ల ధనం దొంగతనం కేస్ లో ఇంటరాగేట్ చేస్తారు. అసలు మంచికి మారుపేరు లాంటి సత్యను ఎందుకు అరెస్ట్ చేశారా అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్న తరుణంలో.. దొంగతనం చేసింది తాను కాదని, తనలా ఉండే తన తమ్ముడు శివ (సుదీప్) అని చెబుతాడు సత్య. అప్పట్నుంచి పోలీసులు శివ కోసం గాలిస్తుంటారు.
అసలు శివ ఎవరు? నిజంగానే వారు కావలలా లేక సత్య ఆడుతున్న డ్రామానా ఇదంతా? ఒకవేళ డ్రామా అయితే, ఎందుకని ఇలా డ్రామా ఆడుతున్నాడు అనేది “కోటికొక్కడు” చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : కర్ణాటకలో అందరూ ప్రేమగా “అభినయ చక్రవర్తి” అని పిలుచుకొనే సుదీప్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించాడు. సత్య, శివ పాత్రల్లో చూపిన వేరియేషన్ అతడికున్న బిరుదును సార్ధకం చేసాయనే చెప్పాలి. అలాగే.. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ వంటి అన్నిట్నీ ఎంతో అద్భుతంగా పలికించాడు సుదీప్.
కథానాయికగా నటించిన నిత్యామీనన్ పాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా.. కథా గమనంలోనూ కీలకపాత్ర పోషించింది. తెలుగు ప్రేక్షకులకు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సుపరిచితుడైన రవిశంకర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా విశేషంగా ఆకట్టుకొన్నాడు.
సాంకేతికవర్గం పనితీరు : డి.ఇమ్మాన్ సంగీతం, నేపధ్య సంగీతం చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యాయి. రెండేళ్ల క్రితం సినిమా అయినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లైవ్లీగా ఉంది. రాజారధినమ్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ బ్లాక్స్ షూట్ చేసిన విధానం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయం.
ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, సన్నివేశంలోని ఎమోషన్ కు తగ్గట్లుగా టింట్ ఎఫెక్ట్ ను ఛేంజ్ చేయడం అనేది ఆడియన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మాస్ అంశాలన్నీ సమపాళ్లలో మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే.. హీరో మోటివ్ కి స్ట్రాంగ్ రీజనింగ్ ఉంటే బాగుండేది. అది లేకపోవడం వల్ల మాస్ ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయినట్లుగా ఆడియన్స్ కంటెంట్ కి కనెక్ట్ అవ్వలేరు
విశ్లేషణ : ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న “కోటికొక్కడు”, చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసి పబ్లిసిటీ చేస్తే ఈవారం విజేతగా నిలిచే అవకాశం ఉంది.
రేటింగ్ : 2/5