‘హరి హర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేస్తాం అంటూ సినిమా టీమ్ తొలిసారి డేట్ అనౌన్స్ చేసిన ముందు నుండే సినిమా మీద రకరకాల పుకార్లు వచ్చాయి. సినిమా అలా.. సినిమా ఇలా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. ఇక సినిమా డేట్ చెప్పగానే ఇంకా పెరిగాయి. మధ్యలో దర్శకుడు క్రిష్ సినిమా నుండి తప్పుకోవడంతో ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు సినిమా విడుదల అయ్యాక ఆ పుకార్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. సినిమా ఫలితం కూడా దీనికి ఓ కారణం. అయితే ఇందులో కీలకమైన పుకారు పవన్ కల్యాణ్‌కు, క్రిష్ కు మధ్య విభేదాలు వచ్చాయి అనేది మెయిన్ అని చెప్పొచ్చు.
‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వస్తున్నా క్రిష్ నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ఏదో జరిగే ఉంటుంది అనే అనుమానాలు బలపడ్డాయి. అయితే ముందు క్రిష్ ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేయడంతో అలాంటిదేం లేదు అని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత మళ్లీ మొదలయ్యాయి. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ త్వరలోనే ఇందుకు గల కారణాలు బయటకు వస్తాయని చెప్పినట్లు కొన్ని వార్తలొచ్చాయి. దీంతో పవన్‌తో వచ్చిన విభేదాలే కారణమని మళ్లీ పుకార్లు మొదలయ్యాయి.
దీంతో మరోసారి క్రిష్ స్పందిస్తూ.. నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలసి మరో సినిమా చేసేందుకు సిద్ధమే అని క్రిష్ చెప్పారు. దీంతో మరోసారి ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే అసలు కారణమేంటి, క్రిష్ ఎందుకు సినిమా నుండి తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు క్రిష్ సినిమాల నుండి తప్పుకోవడం / తప్పించడం కొత్తేమీ కాదు. గతంలో ‘మణికర్ణిక’ సినిమా నుండి ఇలానే బయటకు వచ్చేశారు. ఆ మిగిలిన సినిమా కంగనా రనౌత్ సొంతంగా పూర్తి చేసుకున్నారు.