నేను ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాను. కొన్నాళ్లుగా నాకు సరైన సక్సెస్ లేదు. ముఖ్యంగా ఇప్పుడు నాకు కమర్షియల్ సక్సెస్ చాలా అవసరం’ అన్నారు దర్శకులు క్రిష్ జాగర్లమూడి. తాజాగా జరిగిన ‘ఘాటి’ ప్రెస్మీట్లో భాగంగా క్రిష్ ఓపెన్ గానే మాట్లాడారు.
‘నిర్మాత బాగుండాలి.. నిర్మాత ఇంకో సినిమా చేయగలగాలి అంటే ‘ఘాటి’ కమర్షియల్ గా సక్సెస్ సాధించాలి. ఈసారి పంధా మార్చుకుని ‘ఘాటి’ అనే కమర్షియల్ సినిమా చేశాను. అలాగే నేను చెప్పాలనుకున్న కథ కూడా ఇందులో ఉంటుంది. నా గత చిత్రం ‘కొండపొలం’ థియేటర్లలో ఆడలేదు. ఓటీటీలో ఆ సినిమాని చూసి చాలా మంది బాగుందని చెప్పారు. అది మాకు కమర్షియల్ గా ఉపయోగపడదు కదా. ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా నేను మొదలు పెట్టాను. ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ రావడంతో.. వేరే కమిట్మెంట్స్ కూడా ఉండటం వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది. ‘ఘాటి’ లో అనుష్క విశ్వరూపం చూస్తారు. ‘అరుంధతి’ ‘సరోజ'(వేదంలో) ‘దేవసేన'(బాహుబలిలో) ‘భాగమతి’ వంటి ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క వల్లే పుట్టాయి. ‘ఘాటి’ లో శీలావతి అనే పాత్ర కూడా అంతే’ అంటూ చాలా ఓపెన్ గా క్రిష్ తన గురించి చెప్పుకొచ్చారు.
నిజమే క్రిష్ కి కొన్నాళ్ల నుండి సరైన సక్సెస్ లేదు. కానీ అతని రైటింగ్ ని తక్కువ అంచనా వేయలేం. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో సినిమాని తీసి.. ఆడియన్స్ ని కన్విన్స్ చేయగల సత్తా క్రిష్ లో ఉంది. సెప్టెంబర్ 5న ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేస్తారనే నమ్మకం కూడా ఆడియన్స్ లో కనిపిస్తుంది.