సత్యదేవ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ సమర్పణలో తెరకెక్కిన చిత్రం “కృష్ణమ్మ”. కొన్నేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి సినిమాగా ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!
కథ: పుట్టుకతోనే అనాధలు భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణతేజ రెడ్డి). మంచి స్నేహితులైన వీళ్ళు ముగ్గురిలో భద్ర & కోటి మాత్రం చిన్నపాటి దొంగపనులు చేస్తుంటారు. ఒకానొక సందర్భంలో పోలీసులు బలవంతంగా ఈ ముగ్గురినీ ఓ పెద్ద కేసులో ఇరికిస్తారు. ఆ కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది ఈ ముగ్గురికీ. అసలు ఏమిటా కేసు? ఈ ముగ్గిరినీ ఎందుకు టార్గెట్ చేశారు? ఆ కేస్ నుండి ఈ ముగ్గురు స్నేహితులు ఎలా బయటపడ్డారు? వాళ్ళ జీవితాలను టార్గెట్ చేసిన వాళ్లపై ఏ విధంగా పగ తీర్చుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “కృష్ణమ్మ” చిత్రం.
నటీనటుల పనితీరు: సత్యదేవ్ మరోసారి తన నటనతో పాత్రకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో సత్యదేవ్ నటన విశేషంగా అలరిస్తుంది. పోలీస్ వ్యవస్థ మరియు పెద్ద మనుషుల ముసుగులో కొందరు చేసే అన్యాయాలను ఎండగట్టిన విధానం బాగుంది. సదరు సన్నివేశాల్లో సత్యదేవ్ నటన & డైలాగులు బాగా పేలాయి.
లక్ష్మణ్ మీసాల తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ & డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. కృష్ణతేజ రెడ్డిలో అమాయకత్వం కొన్ని సన్నివేశాలకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది. పోలీస్ ఆఫీసర్ గా నటించిన కన్నడ నటుడు విలనిజాన్ని బాగా పండించాడు. అతిరాజ్ చక్కనైన తెలుగమ్మాయిలా ఒదిగిపోయింది.
సాంకేతికవర్గం పనితీరు: కాలభైరవ నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఎమోషన్స్ ను భలే ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని యాక్షన్ బ్లాక్స్ & ఎమోషనల్ సీన్స్ కి కాలభైరవ ఇచ్చిన నేపధ్య సంగీతం సినిమాకి హైలైట్ గా నిలిచాయి. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి మాస్ వేల్యూ యాడ్ చేసింది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ ను బాగా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు.
దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ 2007లో జరిగిన ఆయేషా ఉదంతాన్ని మూలకథగా తీసుకొని.. కథనాన్ని అల్లుకున్న విధానం బాగుంది. అయితే.. ఫస్టాఫ్ లో డ్రామా పండలేదు. అలాగే ఫ్రెండ్ షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇరికించిన సన్నివేశాలు వర్కవుటవ్వలేదు. కానీ.. సెకండాఫ్ లో సినిమా గ్రిప్పింగ్ గా సాగేలా యాడ్ చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా వర్కవుటయ్యాయి. అలాగే రివెంజ్ తీసుకొనే సన్నివేశాలను కూడా బాగా రాసుకున్నాడు. కాకపోతే.. సదరు సన్నివేశాలను తెరకెక్కించిన తీరు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మంచి సీన్ కంపోజీషన్ ఉంటే గనుక ఈ సీన్స్ బాగా వర్కవుటయ్యేవి. అది లోపించడంతో సత్యదేవ్ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించలేదు.
విశ్లేషణ: ఒక మంచి రివెంజ్ డ్రామాకు కావాల్సిన అన్నీ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం “కృష్ణమ్మ”. కానీ.. కథను, కథలోని ఎమోషన్స్ ను చక్కగా ఎలివేట్ చేసే స్థాయిలో కథనం మరియు సన్నివేశాలు లేకపోవడంతో సినిమా ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేక చతికిలపడింది. అయితే.. సత్యదేవ్ నటన, కాలభైరవ నేపధ్య సంగీతం మరికొన్ని మాస్ ఎలిమెంట్స్ కోసం మాత్రం సినిమాను ఒకసారి థియేటర్లో చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: పరవళ్ళు తొక్కి.. పక్కదోవ పట్టిన కృష్ణమ్మ ప్రతీకార జ్వాల!
రేటింగ్: 2.5/5