కుడి ఎడమైతే సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • July 17, 2021 / 11:56 AM IST

ఆహా ఒటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ “కుడి ఎడమైతే”. “లూసి, యూ టర్న్” లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ తో అలరించిన పవన్ కుమార్ ఈ సిరీస్ కి డైరెక్టర్. విజయ్ మాస్టర్ కుమారుడు రాహుల్ విజయ్, అమలపాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులకి మంచి ఆసక్తి కలిగించాయి. మరి సిరీస్ ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!

కథ: రిపీట్ అనే ఫుడ్ డెలివరీ సంస్థలో పని చేస్తూ.. నటుడిగా ఎదగడం కోసం ఆడిషన్స్ అటెండ్ అవుతూ ఉంటాడు ఆది (రాహుల్ విజయ్). ఏ.సి.పి హత్య కేసు, వరుణ్ అనే కుర్రాడి కిడ్నాప్ కేస్ డీల్ చేస్తూ ఫుల్ టెన్షన్ లో ఉంటుంది దుర్గ (అమలపాల్). ఈ ఇద్దరూ ఫిబ్రవరి 29 తేదీలో ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళు చనిపోయిన ప్రతిసారి మళ్ళీ ఫిబ్రవరి 29తోనే వాళ్ళ రోజు మొదలవుతుంది. మొదటిసారి కంగారుపడినా, రెండోసారి, మూడోసారికి అంతా కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. అయితే.. వాళ్ళు కంట్రోల్ చేసేది సమయాన్ని, పరిస్థితుల్ని కాదని, తమ భవిష్యత్ ను మాత్రం మార్చుకోలేకపోతున్నారని అర్ధమవుతుంది. ఇంతకీ ఆ టైమ్ లూప్ నుంచి వాళ్ళు బయటపడ్డారా? చివరికి ఏం జరిగింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: నటుడిగా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రాహుల్ విజయ్ కి ఎట్టకేలకు అది లభించినట్లేనని చెప్పాలి. హావభావాల నుంచి, బాడీ లాంగ్వేజ్ వరకూ ప్రతి విషయంలో పరిణితి ప్రదర్శించాడు. నటుడిగా ఒక మెట్టు ఎక్కాడనే చెప్పాలి.

అలాగే అమలపాల్ కూడా తనదైన శైలి నటనతో అలరించింది. ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటన సిరీస్ కి హైలైట్ అనే చెప్పాలి. అలాగే.. చిన్న పాత్రే అయినప్పటికీ రవిప్రకాష్ కూడా డిఫరెంట్ రోల్లో ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: కెమెరామెన్ అద్వైత గురుమూర్తి గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ విజన్ ను తెరపైకి తీసుకురావడం అంత సులభమైన పనికాదు. అందులోనూ రిపీటెడ్ షాట్స్ & సీన్స్ ఉన్నప్పుడూ ఇది చాలా కష్టం. దాన్ని అద్వైత గురుమూర్తి అర్ధవంతంగా, అద్భుతంగా నిర్వర్తించాడు.

పూర్ణ చంద్ర సంగీతం కూడా సిరీస్ కి యాడ్ ఆన్ అయ్యింది. మంచి ఇంటెన్సిటీ క్రియేట్ చేయడంలో నేపధ్య సంగీతం కీలకపాత్ర పోషించింది.

రెగ్యులర్ థ్రిల్లర్స్ కు టిపికల్ స్క్రీన్ ప్లే యాడ్ చేయడంలో దర్శకుడు పవన్ కుమార్ ఎప్పుడూ సిద్ధహస్టుడే. అతడి మునుపటి చిత్రాలు “లూసి, యూటర్న్” చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. “కుడి ఎడమైతే” సిరీస్ కి కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకూ పరిచయం లేని టైమ్ లూప్ ను కథా గమనానికి ఎంపిక చేసుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడు. ఇక కథను బోర్ కొట్టించకుండా నడిపి పూర్తిస్థాయి విజయం సాధించాడు. అయితే.. లాక్ డౌన్ టైంలో ప్రపంచ సినిమాకి బాగా అలవాటుపడిన ఒటీటీ ఆడియన్స్ కు ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. కానీ.. మాస్ ఆడియన్స్ కు ఇది కొత్తగా అనిపిస్తుంది.

అయితే.. పవన్ ఎక్కడా కూడా టైమ్ లూప్ అంటే ఏమిటి అనేది వివరించడానికి ప్రయత్నించలేదు. సిరీస్ కి అదే ప్లస్ పాయింట్. ఫిబ్రవరి 29 అనే రోజు పాత్రధారుల జీవితాల్లో రిపీట్ అవుతుంది అనే క్లారిటీ ఇచ్చాడు పవన్. లాజికల్ గానూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

రోజు రిపీట్ అవుతుందే కానీ.. టైమ్ నడుస్తుంది అనే విషయాన్ని అరటిపండు ద్వారా, వాళ్ళ టైమ్ లూప్స్ లో మార్పు ఉండదు అనే విషయాన్ని ముసలాయన పాత్ర ద్వారా వెల్లడించిన విధానం బాగుంది. నిజానికి పవన్ కుమార్ ప్రీవీయస్ వర్క్స్ తో కంపేర్ చేస్తే “కుడి ఎడమైతే” అతని రేంజ్ సిరీస్ కాదు. ఇంకా డెప్త్ తో తీయొచ్చు. కానీ.. సాధారణ ప్రేక్షకులకు కూడా అర్ధమయ్యే రీతిలో తీయాలనే ఆలోచనతో ఇలా మొగ్గు చూపాడని తెలుస్తున్నప్పటికీ.. ఇంకాస్త లాజికల్లీ బెటర్ అవుట్ పుట్ ఉండి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: మరీ నెట్ ఫ్లిక్స్, అమేజన్ ప్రైమ్ సిరీస్ లతో కంపేర్ చేయకుండా, ఒక చక్కని తెలుగు సిరీస్ లా చూస్తే “కుడి ఎడమైతే” ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఆసక్తికరమైన కథ, ఆకట్టుకొనే క్యారెక్టరైజేషన్స్ తో “కుడి ఎడమైతే” సిరీస్ ఆహా కి మొదటి హిట్ అందించిందనే చెప్పాలి.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus