Lambasingi Review in Telugu: లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • భరత్ రాజ్ (Hero)
  • దివి (Heroine)
  • వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు. (Cast)
  • నవీన్ గాంధీ (Director)
  • ఆనంద్.టి (Producer)
  • ఆర్ఆర్.ధ్రువన్ (Music)
  • కె.బుజ్జి (Cinematography)
  • Release Date : మార్చి 15, 2024

మార్చి 15న..(ఈరోజు) ఆ డేట్ కి తగ్గట్టే 15 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే..! అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు రెండు, మూడు ఉన్నాయి. అందులో ‘లంబసింగి’ (Lambasingi) అనే సినిమా కూడా ఒకటి. ‘బిగ్ బాస్’ దివి (Divi Vadthya) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఇది. అంతేకాదు ‘సోగ్గాడే చిన్ని నాయన’ (Soggade Chinni Nayana) ‘రారండోయ్ వేడుక చూద్దాం'(Rarandoi Veduka Chudham) ‘బంగార్రాజు’ (Bangarraju) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.

ఆయన సమర్పణలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ డిఫరెంట్ గా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించాయి అని చెప్పాలి. మరి ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: వీరబాబు(జై భరత్ రాజు)కి (Jai Bharat Raj) పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. ఇందులో భాగంగా అతనికి లంబసింగి అనే గ్రామంలో పోస్టింగ్ పడుతుంది.ఆ గ్రామంలో నక్సలైట్లుగా ఉన్నవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అక్కడి హాస్పిటల్స్ లో అత్యవసర సదుపాయాలు వంటివి ఉండవు. అలాగే అక్కడి పోలీసులకి రాజకీయ నాయకుల మీటింగ్లకి సెక్యూరిటీగా వెళ్లడం తప్ప ఇంకో పని ఉండదు. అలాంటి ఊరికి కానిస్టేబుల్ గా వచ్చిన వీరబాబు తొలిచూపులోనే హరిత(దివి)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె మాజీ నక్సలైట్ కోనప్ప కూతురు.

అయితే ఆ ఊర్లో లొంగిపోయిన నక్సలైట్లు రోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంటుంది. కోనప్ప కాలుకి గాయం అవ్వడంతో రోజూ అతని ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించాల్సిన డ్యూటీ వీరబాబుకి పడుతుంది. హరితతో ప్రేమలో ఉన్నాడు కాబట్టి.. ఆ పనిని చాలా సంతోషంగా చేస్తూ ఉంటాడు వీరబాబు. ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఓ రోజు రాత్రి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. అతన్ని కాపాడటానికి హరిత, వీర బాబు.. చాలా శ్రమిస్తారు. ఈ క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. అదే మంచి టైం అని భావించి ఓ రోజు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ అతని ప్రేమకు ఆమె నో చెబుతుంది.

దీంతో తీవ్రంగా నిరాశ చెందుతాడు వీరబాబు. అలాంటి టైంలో అతను ఒక రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా.. అక్కడ ఉన్న ఆయుధాల కోసం కొంతమంది పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తారు. ఈ క్రమంలో వీరబాబు గాయపడతాడు.. అదే టైంలో అతనికి ఇంకో షాక్ తగులుతుంది. ఎందుకంటే అతని పై దాడి చేసిన వారిలో హరిత కూడా ఉంటుంది. అసలు హరిత పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారి గ్యాంగ్ లో ఎందుకు ఉంది.? ఆమె గతం ఏంటి? ఆ దాడి తర్వాత వీరబాబు జీవితం ఎలా మారింది? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : ఈ సినిమా కథ మొత్తం దివి పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. ముందుగా ఆమె గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు దివిని గ్లామర్ యాంగిల్…లో మాత్రమే ప్రెజెంట్ చేశారు కొంతమంది మేకర్స్. కానీ ఆమెలో మంచి నటి కూడా ఉందని ‘గాడ్ ఫాదర్’ తో (GodFather) ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాతో ఆ విషయం మరోసారి బయటపడింది.

ఈ సినిమాలో లుక్స్ పరంగా ఎక్కడా ఎక్స్పోజింగ్ కి తావివ్వకుండా చాలా చక్కగా కనిపించింది, నటించింది. హీరో భరత్ రాజ్ కూడా పర్వాలేదు అనిపించాడు. క్లైమాక్స్ లో అతని నటన బాగుంది. మిగిలిన నటీనటులైన వంశీ రాజ్ (Vamsi Raj), కిట్టయ్య (Kittayya) , నిఖిల్ రాజ్ వంటి వారు పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు నవీన్ గాంధీ (Naveen Gandhi).. ఓ సింపుల్ లవ్ స్టోరీకి.. నక్సలిజం టచ్ ఇచ్చాడు. టాలీవుడ్లో ఇప్పటివరకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు సీరియస్ గా సాగాయి. కానీ ఇందులో ఎంటర్టైన్మెంట్ ను కూడా పర్ఫెక్ట్ గా సింక్ చేశాడు దర్శకుడు. అలా అని కథ గాడి తప్పిన ఫీలింగ్ కలగదు. చివరి వరకు హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఎలా ముగుస్తుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది.

క్లైమాక్స్ కి అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్లస్. అన్ని పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం, ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ పోర్షన్ స్లోగా ఉండటం కొంచెం మైనస్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: ‘లంబసింగి’… నక్సలిజం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇదొక వినూత్న ప్రయత్నం. ఈ వీకెండ్ కి థియేటర్లలో ట్రై చేయదగ్గ సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్: 2.75 /5

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus