తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “ఆండవన్ కట్టలై” చిత్రాన్ని తెలుగులో రక్షిత్ అనే యువకుడ్ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు మారుతి నిర్మించిన చిత్రం “లండన్ బాబులు”. రైటర్ చిన్నికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్వాతిరెడ్డి కథానాయికగా నటించింది. గత రెండువారాలుగా విడుదల కోసం వేచి చూస్తున్న ఈ చిత్రం థియేటర్లు దొరకడంతో నేడు (నవంబర్ 17)న ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి తమిళనాట సక్సెస్ అయిన స్టోరీ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం…!!
కథ : లండన్ వెళ్ళి బాగా సంపాదించాలనే ఆశయంతో తన స్నేహితులతో కలిసి అంతర్వేది నుంచి హైద్రాబాద్ వస్తాడు గాంధీ (రక్షిత్). అయితే… అన్నీ అంశాల్లోనూ పర్ఫెక్ట్ అయిన తనకు కాకుండా ఎలాంటి అర్హత లేని తన స్నేహితుడు (సత్య)కు లండన్ వీసా రావడంతో, సరైన మార్గంలో కాక రాంగ్ రూట్ లో వీసా సంపాదించాలనుకొంటాడు గాంధీ. ఆ క్రమంలో పరిచయమవుతుంది టీవీ రిపోర్టర్ సూర్యకాంతం (స్వాతిరెడ్డి). సూర్యకాంతంను దొంగపెళ్ళి చేసుకొని ఆ ప్రూఫ్ తో లండన్ వెళ్లాలనుకొంటాడు గాంధీ. ఆ క్రమంలో ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితుల చుట్టూ తిరిగే సరదా సినిమానే “లండన్ బాబులు”.
నటీనటుల పనితీరు : కొత్తబ్బాయి అయినప్పటికీ.. అమాయకుడైన గాంధీ పాత్రలో ఆకట్టుకొన్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తొలి ప్రయత్నంలోనే పర్వాలేదనిపించుకొన్నాడు. ఎమోషన్స్ పండించే విషయంలో ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేది. స్వాతిరెడ్డి ఎప్పట్లానే క్యూట్ గా కనిపించింది. ఆమె పాత్ర చుట్టూనే సినిమా తిరగడం వలన ఏదో కొత్త హీరో సినిమా చూస్తున్నామన్న భావన ప్రేక్షకులకు కలగదు. పైగా.. స్వాతి పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ఇక పాండు పాత్రలో “నేను లండన్ సిటిజన్” అంటూ సత్య చేసే కామెడీకి థియేటర్ దద్దరిల్లిపోతాయి. బాబ్జీగా ధనరాజ్ కామెడీతోపాటు ఎమోషన్ ను కూడా పండించాడు. ఫస్టాఫ్ మొత్తం సత్య కామెడీ హైలైట్ అయితే.. సెకండాఫ్ లో విడాకుల స్పెషలిస్ట్ లాయర్ గా అలీ చాలాకాలం తర్వాత పూర్తి స్థాయిలో నవ్వించాడు. ముఖ్యంగా భార్య పాత్రధారి సత్యకృష్ణతో అలీ కాంబినేషన్ సీన్స్ ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. మురళీకృష్ణ, రాజారవీంద్ర, అజయ్ ఘోష్ లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్స్ పాత్ర పరిధిమేరకు ఆకట్టుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు : మ్యూజిక్ డైరెక్టర్ “కె” బ్యాగ్రౌండ్ స్కోర్ రిపీటెడ్ గా అనిపించినా.. పాటలు కొత్తగా వినసోంపుగా ఉన్నాయి. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. మీడియం బడ్జెట్ సినిమా అయినప్పటికీ చాలా రిచ్ గా కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్. ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. తమిళ రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చేసిన మార్పులు ఆకట్టుకొంటాయి. తమిళంలో సినిమా విజయం సాధించడానికి ముఖ్యకారణాలైన కామెడీని అదే స్థాయిలో తెలుగులోనూ ప్రెజంట్ చేయడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హీరోహీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్ అండ్ స్టోరీని బేస్ చేసుకొని రాసుకొన్న సినిమా కావడంతో ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ కంటే కామెడీని, క్యారెక్టర్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వ ప్రతిభ మీద మారుతి ప్రభావం చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. అయితే.. ఒక కొత్త హీరో నుంచి మంచి నటన రాబట్టుకోవడంతోపాటు మధ్యమధ్యలో బోర్ కొట్టించినా ఓవరాల్ గా ఎంటర్ టైన్ చేసిన చిన్నికృష్ణ ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ హిట్ అందుకొన్నట్లే.
విశ్లేషణ : సత్య, అలీ కామెడీ మెయిన్ హైలైట్స్ గా రూపొందిన చిత్రమిది. ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ను చూసి చాలా కాలమవుతుండడం… ఈవారంలో మరో చూడదగ్గ తెలుగు సినిమా కూడా లేకపోవడం “లండన్ బాబులు” చిత్రానికి కలిసొచ్చే అంశం. పెద్దగా లాజిక్స్ పట్టించుకోకుండా కేవలం కామెడీని ఎంజాయ్ చేయాలనుకొనే ఆడియన్స్ “లండన్ బాబులు” చిత్రాన్ని సరదాగా ఒకసారి చూడవచ్చు.
రేటింగ్ : 2/5