చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు… ఇది పాత వార్తే. ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ త్వరలో సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నాడు… ఇది మొన్నీమధ్య వినిపించిన వార్త. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అదే.. ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ రావడం లేదు. అదేంటి… నటిస్తా అని సల్మానే చెప్పాడు కదా. మళ్లీ ఇదేంటి అంటరా? అవును షూటింగ్ కోసం సల్మాన్ ఇక్కడికి రావడం లేదు. కానీ షూటింగ్లో పాల్గొంటాడు.
తొలుత అనుకున్న ప్రకారం సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో సెట్స్ వేస్తున్నారని, సల్మాన్ వచ్చి షూట్ పూర్తి చేసుకొని వెళ్తారని అన్నారు. కానీ ఇప్పుడు సల్మాన్ రావడం లేదని, చిరంజీవే ముంబయి వెళ్తున్నారట. త్వరలో ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి – సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సీన్స్‌ను ముంబయి సమీపంలోని ఎన్డీ స్టూడియోస్‌లో చిత్రీకరించబోతున్నారట. వారం రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణతో షెడ్యూల్ పూర్తవుతుందట. షూటింగ్ జరిగేనన్ని రోజుల్లో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లోనే చిరంజీవి ఉండబోతున్నాడని సమాచారం.
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాకు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కుతోంది. ఇందులో మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారు. ఇక మాతృకలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. ఆ మధ్య సల్మానే ఈ విషయం అధికారికంగా ప్రకటించాడు కూడా. ఇక మరో కీలక పాత్రలో నయనతార నటించింది. ఇటీవల ఆమె సీన్స్ పూర్తయ్యాయి. మలయాళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ప్రారంభానికి చాలా ఆటంకాలు వచ్చాయి.
అనుకున్న దర్శకులు మారారు. డేట్లు మారాయి. కథలో కూడా చిన్నపాటి మార్పులు చేశారు అని చెబుతారు. ఏదేమైనా చిరంజీవి సినిమాలో, సల్మాన్ ఖాన్ అనేసరికి అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. నిజానికి అంతకుముందు ఈ పాత్ర కోసం తెలుగు స్టార్ హీరోలు అనుకున్నారు. కానీ సల్మాన్వైపే చిరంజీవి మొగ్గుచూపారట. అలా టాలీవుడ్ ప్రేక్షకుల చిరకాల కోరిక కూడా నెరవేరుతోంది. అదేనండీ సల్మాన్ తెలుగు తెరపై చూడాలనే కోరిక.