Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్.. ఇదేం లాజిక్.. అక్కడేం జరుగుతోంది?
- July 2, 2026 / 06:10 PM ISTByFilmy Focus Desk
రాజకీయాల గురించి ఈయన ఏం చెబుతున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాలు, సినిమా పరిశ్రమలో ఓ వ్యక్తి గురించి ఇదే మాట అంటున్నారు. వాళ్లు అంటున్నారని కాదు కానీ.. ఆయన మాటలు అలానే ఉన్నాయి మరి. రాజకీయాల్లోకి రాకుండా రాజకీయ నాయకులు మాట్లాడినట్లు మాట్లాడుతుండటమే దానికి కారణం. ఇంత కన్‌ఫ్యూజ్ చేస్తున్న ఆ వ్యక్తే ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, సంఘ సేవకుడు రాఘవ లారెన్స్.
Raghava Lawrence
ఇంత కన్‌ఫ్యూజ్ ఉన్నప్పుడు మరోసారి ఆయన వీడియో రిలీజ్ చేసి మరింత కన్‌ఫ్యూజ్ చేశారు. నిదానంగా ఆలోచించి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఆయన.. గతంలో తాను చేసిన ప్రకటన చూసి కొంతమంది రకరకాల కామెంట్లు చేశారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చు కదా? దాని గురించి ప్రజలను ఎందుకు అడగటం అని తనను అడిగారని.. అయితే తన ఉద్దేశం అది కాదని చెప్పారు. ఫౌండేషన్‌ను చూసుకో, రాజకీయాల్లోకి రావద్దు అని ప్రజలు భావిస్తే ఇబ్బంది కదా అని.. వారి అభిప్రాయాన్ని అడిగానని క్లారిటీ ఇచ్చారు.
నలుగురికి మంచి చేస్తున్నాను కాబట్టి రాజకీయాల్లోకి వస్తున్నానని మాత్రమే చెప్పాను. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నాకు ఓట్లు వేస్తామని కొంతమంది అన్నారు. అయితే అక్కడ నేను పోటీ చేయాలనుకోవడం ధర్మం కాదు అనిపిస్తోంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కార్యకర్తగా కొంతకాలం సేవలు అందించాలని అనుకుంటున్నాను. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆలోచిస్తాను అని చెప్పారు లారెన్స్. అయితే ఆఖరులో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని కొసమెరుపు ఇచ్చారు.
అలాగే తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయనని చెబుతున్నానని, ఇంకెక్కడా పోటీ చేయనని అర్థం కాదని కూడా చెప్పారు. ఇంకాస్త ఆలోచించిన తర్వాతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, ఎవరైనా విమర్శ చేస్తే తట్టుకోలేనని తన ఇబ్బంది గురించి చెప్పారు. మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పారు. అని లారెన్స్ తెలిపారు.
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి విజయ్ విజయం సాధించారు. వాటిలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ జరగనున్న ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. అక్కడి నుండి లారెన్స్ పేరు ప్రజల నోళ్లలో నానుతోంది. ఆయన కూడా ఆసక్తి చూపించినా.. ఏమైందో కానీ ఇప్పుడు కాసేపు తిరుచ్చి వద్దని, ఇంకాసేపు రాజకీయాలు వద్దని చెబుతున్నారు.










