Liger Movie: ఒకరు తీశారు.. మరొకరు నెట్టారు.. జనాలు XXX!

  • September 1, 2022 / 01:21 PM IST

సినిమా అనేది గ్రూప్‌ ప్రోడెక్ట్‌.. అంటే ఏ ఒకరిద్దరో కలసి చేసేది కాదు. అయితే అందులో కీలక పాత్ర దర్శకుడు, కథానాయకుడుకి ఉంటుంది. ఈ మాటను ఎవరూ కాదనలేరు. ఆ లెక్కన సినిమా విజయం సాధించినా, విఫలమైనా దానికి కారణం అందరూ అవుతారు. ముఖ్యంగా దర్శకుడు, హీరో అవుతారు. విజయం దగ్గరకు వచ్చేసరికి ఈ మాటకు అందరూ ఓకే అంటారు కానీ, పరాజయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ‘తప్పు నీదంటే నీది’ అని చెబుతుంటారు. అభిమానులు కూడా ఇలానే ఉంటారు. ‘లైగర్‌’ విషయంలో ఇప్పుడు ఇదే చర్చ.

ఎన్నో అంచనాలతో ‘దేశాన్ని షేక్‌ చేస్తాం’ అంటూ వచ్చిన ‘లైగర్‌’ బాక్సాఫీసు దగ్గర ఘోరంగా విఫలమైంది. ఆ సినిమా పరాజయం టీమ్‌ని బాగా డౌన్‌ చేసేసి ఉంటుంది. అయితే పుండు మీద కారం చల్లినట్లు సినిమా వైఫల్యానికి నెటిజన్ల ట్రోలింగ్ కారంలా మారింది. సినిమా ఫ్లాప్‌ అవ్వడానికి ఎవరు కారణం అంటూ లెక్కలేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ పనితనం, హీరో విజయ్‌ దేవరకొండ వర్క్‌ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇంతటి దారుణ పరాజయానికి కారకులు ఎవరు అనేది చూస్తే.. చాలా పేర్లే వస్తున్నాయి.

పూరి జగన్నాథ్‌ సినిమా.. ఇది ఓ బ్రాండ్‌. ఆయన గతంలో తీసిన సినిమాలు అలాంటివి మరి. పూరి సినిమాకు ముందు, తర్వాత హీరోలను డిఫరెన్సియేట్‌ చేస్తుంటారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. అంతలా హీరో ఇమేజ్‌ను మారుస్తారు ఆయన. దానికి ఆయన మార్కు కథ, కథనం, యాటిట్యూడ్‌ ఉంటాయి. ‘లైగర్‌’ దగ్గరకు వచ్చేసరికి ఈ మూడు విషయాల్లోనూ ఆయన ప్రభావం కనిపించలేదు. దీంతో పూరి రాతకి, తీతకి ఉన్న ఫ్యాన్స్‌ సంతృప్తి చెందలేకపోయారు.

ఇక విజయ్‌ దగ్గరికొస్తే.. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన శరీరాన్ని చాలావరకు మార్చుకున్నాడు. యాక్షన్‌ సినిమా కోసం అందులోనూ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కోసం కష్టపడ్డాడు. అయితే ఆ కష్టం ఈ సినిమాకు పడాల్సింది కాదు. అంటే ఏ సినిమా కోసం ఎంత చేయాలి అనేది హీరోకు తెలిసి ఉండాలి. దేశాన్ని షేక్‌ చేస్తాం అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి కథలో సత్తా ఉండాలి. లేదంటే అంచనాలు పెరిగిపోయి, థియేటర్‌కి వెళ్లాక ఫ్యాన్ ‘ఛస్‌ ఇదేం సినిమా’ అనకూడదు.

అంచనాలు పెంచేస్తే వచ్చే సమస్యలు గత నాలుగు సినిమాలుగా విజయ్‌కి బాగా తెలుసు. ఈ క్రమంలో విజయ్‌ యాటిట్యూడ్‌ కూడా ఇప్పుడు ఫలితానికి కారణం అంటూ మాటలు పడుతున్నాడు. నిజానికి యాటిట్యూడ్‌కి సినిమా ఫలితానికి సంబంధం ఉంటుందా? అంటే కచ్చితంగా ఉండదు. అయితే ఫ్లాప్‌ వచ్చినప్పుడే మిగిలిన విషయాలు బయటికొస్తాయి. అలా ఆయన యాటిట్యూడ్‌ కూడా అలానే ఇప్పుడు హైలైట్‌ అవుతోంది. ఇక ‘వాట్‌ లగా దేంగే’ అంటూ సినిమా టీమ్‌ దేశం మొత్తం చుట్టేసింది.

బాగున్న సినిమాకు బాగా ప్రచారం చేయాలి. కాస్త తేడా కొడితే.. జాగ్రత్తగా ప్రచారం చేయాలి. ఎంత ఖర్చు పెట్టాలి ప్రచారానికి అనేది నిర్మాతకు తెలియాలి. అన్నింటికీ మించి ఏ కథకు ఎంత పెట్టాలి అనేది కూడా నిర్మాతకే తెలియాలి. ఒకవేళ ఓటీటీకి ఇచ్చేయడం లాంటి మంచి అవకాశం వస్తే వదులుకోకూడదు. అలా వదులకుని, ఎక్కువ ఖర్చు చేసింది నిర్మాత ఛార్మి. ఈ లెక్కన సినిమా ఫ్లాప్‌కి కారకులు ఎవరు, నష్టాలకు కారకులు ఎవరు అనేది ‘లైగర్‌’ టీమ్‌కి బాగా తెలుసు. కాబట్టి పంచనామా చేసుకుని నెక్స్ట్‌ సినిమాకు రెడీ అయితే మంచిది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus