తనదైన శైలి సోషల్ మీడియా కంటెంట్ తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే మౌళి హీరోగా మారి నటించిన చిత్రం “లిటిల్ హార్ట్స్” (Little Hearts). 90’s వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్న ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సాయి మార్తాండ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అఖిల్ (మౌళి) ఎంసెట్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడంతో.. తండ్రి బలవంతం మేర లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ కాత్యాయని (శివానీ) పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు.
కట్ చేస్తే.. అఖిల్ ప్రపోజ్ చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం చెబుతుంది కాత్యాయని.
ఏంటా షాకింగ్ మేటర్? అది అఖిల్ లవ్ ని ఎలా ఎఫెక్ట్ చేసింది? మరి రాజా గాడికి రోజా దొరికిందా? ఈ ఇంటర్మీడియట్ నిబ్బా-నిబ్బీల కథ సుఖాంతం అయ్యిందా? అనేది “లిటిల్ హార్ట్స్” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాలో హీరో మౌళి అయినప్పటికీ.. నేను పర్సనల్ గా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ మధు పాత్ర పోషించిన జయకృష్ణది. స్ట్రయిట్ ఫేస్ పెట్టుకుని అతడు వేసే పంచులు భలే పేలతాయి.
ఇక మౌళికి టైలర్ మేడ్ క్యారెక్టర్ ఇది. ఇన్నాళ్లూ మౌళిని ఎలా చూస్తున్నామో, అచ్చుగుద్దినట్లు అలానే కనిపించాడు. అతడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ భలే ఉంటాయి. చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు.
శివాని కూడా క్యూట్ గా, అమాయకత్వంతో కూడిన ఒక నిజాయితీని పలికించిన విధానం బాగుంది.
రాజీవ్ కనకాల పోషించిన సగటు తండ్రి పాత్రకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆయన పాత్రని మోసిన విధానం కూడా హుందాగా ఉంది.
ఎస్.ఎస్.కాంచి, సత్యకృష్ణ, అనిత చౌదరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సింజిత్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాయి. ఈమధ్యాకాలంలో సంగీతం సాహిత్యాన్ని కాంప్లిమెంట్ చేయడం అనేది కనుమరుగవుతుంది. కానీ.. “లిటిల్ హార్ట్స్” (Little Hearts) సినిమాలో సింజిత్ చాలా సింపుల్ గా సాహిత్యాన్ని వినిపించేలా చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ డీసెంట్ గా ఉన్నాయి.
దర్శకుడు సాయి మార్తాండ్ కథ మీద కంటే.. సంభాషణలు, సందర్భాల మీద ఎక్కువగా దృష్టి సారించాడు. ఆ కారణంగా కథగా ఈ చిత్రం ఆకట్టుకోకపోయినా, సందర్భాలు, సన్నివేశాలు మాత్రం హిలేరియస్ గా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా 90’s కిడ్స్ కి ఈ చిత్రం చాలా రిలేటబుల్ గా ఉంటుంది. అలాగే నవతరం ప్రేక్షకులను కూడా ఈ సినిమా అలరిస్తుంది. డైలాగ్స్ తోనే సినిమాని లాక్కొచ్చేశాడు సాయి మార్తాండ్.
కథగా కూడా ఇంకాస్త వెయిటేజ్ ఉండుంటే ఇంకాస్త బాగుండేది. మౌళి ట్రైలర్ లాంచ్ లో చెప్పినట్లు ఈ సినిమాని ఓటీటీలో చూస్తే ఈస్థాయి నవ్వుకోరేమో కానీ.. థియేటర్లో గ్యాంగ్ తో కలిసి చూస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా సాయిమార్థాండ్ దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు అనే చెప్పాలి.
విశ్లేషణ: అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా.. సరదాగా, టైంపాస్ కోసం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. రీసెంట్ గా వచ్చిన “ప్రేమలు” కూడా ఆ తరహా చిత్రమే అయినప్పటికీ.. అందులో కాస్త బెటర్ స్టోరీ ఉంటుంది. లిటిల్ హార్ట్స్ లో కావాల్సినంత హ్యూమర్ ఉంది, రిలేట్ అయ్యే సందర్భాలు, సన్నివేశాలు ఉన్నాయి. లోపించిందల్లా కాస్త బలమైన కథ. కానీ.. ఆ లోపం అనేది సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా ఇబ్బందిపెట్టదు. సో, ఎలాంటి అసభ్యత లేని ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: సింపుల్ కామెడీ ఎంటర్టైనర్!
రేటింగ్: 2.5/5