ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ (Ashish Reddy) కథానాయకుడిగా తెరకెక్కిన 3వ చిత్రం “లవ్ మీ ఇఫ్ యూ డేర్” (Love Me) . అయితే.. కారణాంతరాల వల్ల రెండో సినిమాగా విడుదలైంది. దెయ్యంతో ప్రేమ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తి రేకెత్తించాయి. మరి సినిమా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!
కథ: ఎవ్వరూ డేర్ చేయని ప్రదేశాలకు వెళ్లి అక్కడి వ్లాగ్స్ చేస్తూ వైరల్ అవుతాడు అర్జున్ (ఆశిష్). దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుసుకొని.. ఆమెను ఒక్కసారైనా చూడాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ డేర్ కి ప్రతాప్ (రవికృష్ణ), ప్రియ (వైష్ణవి (Vaishnavi Chaitanya) సహాయపడుతుంటారు.
అసలు దివ్యవతి ఎవరు? ఆ దెయ్యం ప్రేమను అర్జున్ పొందగలిగాడా? ఆమె దెయ్యంగా మారడానికి కారణం ఏమిటి? ఈ క్రమంలో ప్రియ గురించి అర్జున్ తెలుసుకున్న విషయాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధాన రూపమే “లవ్ మీ” చిత్రం.
నటీనటుల పనితీరు: మొదటి సినిమాతో పోల్చి చూస్తే ఆశిష్ కాస్త పర్వాలేదనిపించుకున్నాడు. ఐతే.. ఎమోషన్స్ విషయంలో మాత్రం ఇంకాస్త డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హావభావాల విషయంలో ఆశిష్ ఇంకా కృషి చేయాలి. చాలా కీలకమైన ఎమోషన్స్ అతడి ముఖంలో తెలియడం లేదు. అయితే.. డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు.
వైష్ణవి చైతన్యకు చాలా కీలకమైన పాత్ర లభించింది. ఆమె పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. అయితే.. ఆమె క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రం సరిగా రాసుకొని కారణంగా ఆ క్యారెక్టర్ కు ఆడియన్స్ అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయారు. రవికృష్ణ సహాయ పాత్రలో అందరికంటే మంచి నటన కనబరిచాడు. సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) కాస్త బెటర్ అనే చెప్పాలి. చివర్లో ఓ పాపులర్ హీరోయిన్ ను తీసుకొచ్చి సీక్వెల్ ను ఎనౌన్స్ చేయడం వర్కవుటవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు: పి.సి.శ్రీరామ్ (P. C. Sreeram) సినిమాటోగ్రఫీ అనేసరికి మంచి ఫ్రేమింగ్స్ ఆశిస్తాం. కానీ.. సినిమాలో ఎక్కడా ఆయన స్థాయి కెమెరా యాంగిల్స్ కనబడలేదు. కాకపోతే.. సినిమా మాత్రం మంచి రిచ్ గా కనిపిస్తుంది. కీరవాణి (MM Keeravani) సమకూర్చిన పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ మాత్రం కంటెంట్ కి మించిన స్థాయిలో ఉంది. ముఖ్యంగా బంగ్లా సెటప్ కాస్త రెగ్యులర్ ఫార్మాట్ ను భిన్నంగా కాస్త కొత్తగా ట్రై చేసిన విధానం బాగుంది.
దర్శకుడు అరుణ్ భీమవరపు సింగిల్ పాయింట్ గా ఈ కథ చెప్పినప్పుడు దిల్ రాజు (Dil Raju) లాంటి నిర్మాత ఎగ్జైట్ అవ్వడంలో అస్సలు తప్పులేదు. ఆ స్థాయి పాయింట్ ఇది. అయితే.. ఆ పాయింట్ ను కథగా మార్చడంలో విఫలయ్యాడు అరుణ్. ముఖ్యంగా.. వైష్ణవి చైతన్య పాయింటాఫ్ వ్యూలో కథనాన్ని నడపడం ఆమె పాత్రలో ఉన్న ట్విస్ట్ రివీలింగ్ కి పనికొచ్చింది కానీ..
ఓవరాల్ కథ-కథనంలో బోలెడన్ని లూప్ హోల్స్ వదిలేసింది. అందువల్ల.. కథలో చాలా సమాధానం లేని ప్రశ్నలు తలెత్తాయి. అలాగే.. సినిమాను ముగిస్తూ ఇచ్చిన ట్విస్ట్ బాగున్నా.. దానికి సరైన రీజనింగ్ లేక అది కూడా పెద్దగా వర్కవుటవ్వలేదు. ఓవరాల్ గా కథకుడిగా బొటాబొటి మార్కులతో నెట్టుకొచ్చిన అరుణ్ భీమవరపు.. దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడు.
విశ్లేషణ: దెయ్యంతో ప్రేమాయణం అనే కాన్సెప్ట్ లో ఉన్న కొత్తదనం.. కథనంలో లోపించడంతో “లవ్ మీ” ఒక బోరింగ్ ఎక్స్ పెరిమెంట్ గా మిగిలిపోయింది. ఆసక్తికరమైన పాయింట్ కంటే.. ఆకట్టుకునే కథనం ముఖ్యం అనే పాయింట్ ను భవిష్యత్ దర్శకులకు మరోసారి గుర్తు చేసిన సినిమాగా “లవ్ మీ” మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: వాచ్ ఇట్ ఇఫ్ యూ డేర్
రేటింగ్: 1.5/5