లవర్స్ డే

సరిగ్గా ఏడాది క్రితం ఈ సమయానికి ప్రియా వారియర్ ఒక సెన్సేషన్. ఆమె కన్నుకొట్టడం నేషనల్ ఇష్యూ అయిపోయిన తరుణమది. సరిగ్గా ఎడాది తర్వాత ఆమె నటించిన ఓ మలయాళ చిత్రం “లవర్స్ డే” అనే పేరుతో తెలుగులో అనువాదరూపంలో విడుదలైంది. మరి ప్రియావారియర్ కన్ను కొట్టడం సినిమాకి ఏమాత్రం పనికొస్తుందో చూడాలి..!

కథ: డాన్ బాస్కో స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుకోవడం కోసం జాయినైన కొత్త బ్యాచ్ చేసే అల్లరి, వాళ్ళ పరిణితి లేని ప్రేమకథలు, కాలేజ్ గొడవలు, సీనియర్-జూనియర్ ఇష్యూస్ లాంటివి కలగలుపు గంపలాంటి చిత్రమే “లవర్స్ డే” చిత్రం.

నటీనటుల పనితీరు: గాధ జాన్ అనే పాత్ర పోషించిన నూరీన్ షరీఫ్ మినహా.. ఆఖరికి ప్రియా వారియర్ కూడా నటన విషయం అనేది పక్కన పెట్టేసినా కనీసం లుక్స్ తో కూడా ఆకట్టుకోలేకపోయారు.

సినిమా మొత్తంలో ఆకట్టుకున్న పాత్ర ఏదైనా ఉంది అంటే అది కేవలం నూరీన్ మాత్రమే. ఇంతకుమించి నటీనటుల పనితీరు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు: షాన్ రెహమాన్ సంగీతం, శీను సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, ఎడిటింగ్, కలరింగ్, డి.ఐ ఇలా అన్నీ సాంకేతికపరమైన అంశాలు చాలా వీక్ గా ఉన్నాయి.

ఇక దర్శకుడు ఒమర్ లులు తెలుగులో వచ్చిన “హ్యాపీ డేస్”ను ఇంటర్మీడియట్ వెర్షన్ లో మళ్ళీ తెరకెక్కించాడేమో అనిపిస్తుంది తప్ప.. సినిమాలో ఇసుమంతైనా ఫ్రెష్ నెస్ అనేది కనిపించదు. పైగా.. ఆ కుళ్ళు జోకులు, ఒక గాడి లేని కథనం సహనానికి పరీక్ష పెడతాయి. ఇక ఆ కథ, క్లైమాక్స్ ఏదైతే ఉందో ప్రేక్షకులు బుర్ర గోక్కునేలా చేయడం కన్ఫర్మ్.

విశ్లేషణ: సో, ఈ ప్రేమికుల దినోత్సవాన ఈ “లవర్స్ డే” చిత్రాన్ని చూడాలనుకోవడం పెద్ద సాహసమానే చెప్పాలి. ఒకవేళ సాహసించి థియేటర్ లోకి వెళ్ళినా.. చివరివరకూ కూర్చోవడం కష్టమేనండోయ్.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus