వందల కోట్లతో సినిమా చేసి ఇప్పుడు 20 కోట్లకు?

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించే సంస్థలలో లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) ఒకటి. ఒక్కసారి ఈ సంస్థ ఓ సినిమా అనౌన్స్‌ చేస్తే అది ఏ స్థాయిలో ఉండబోతుందో ప్రేక్షకులకు ముందే అర్థమైపోతుంది. 2.0 (Robo 2.0) , ఇండియన్‌ 2 (Indian 2) , పొన్నియన్‌ సెల్వన్ (Ponniyin Selvan) వంటి భారీ సినిమాలు నిర్మించిన లైకా, ఇప్పుడు మాత్రం కొత్త తరహా వార్తల్లో నిలిచింది. భారీ సినిమాల నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు కేవలం 20 కోట్ల బడ్జెట్‌ ఉన్న సినిమాలకే పరిమితం అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది.

Lyca Productions

తాజాగా, ఓ తెలుగు నిర్మాణ సంస్థతో లైకా జాయింట్‌ వెంచర్‌ కోసం చర్చలు జరుపుతోందని సమాచారం. సాధారణంగా లైకా సినిమాలు అంటే 500 కోట్ల పైమాటే అనుకునే సినీ వర్గాలు, ఇప్పుడు ఈ సంస్థ ఫైనాన్స్‌ కోసం ఇతర నిర్మాణ సంస్థలను ఆశ్రయిస్తోందన్న వార్తలతో ఆశ్చర్యపోతున్నారు. కొంతకాలంగా లైకా భారీ నష్టాలను చవిచూస్తోందని, అందుకే తక్కువ బడ్జెట్‌ సినిమాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ సంస్థ ప్రస్తుతం మోహన్‌లాల్‌ (Mohanlal)  – పృథ్విరాజ్‌ (Prithviraj Sukumaran) నటిస్తున్న L2: ఎంపెరర్ (L2: Empuraan) చిత్రాన్ని నిర్మిస్తోంది. లూసిఫర్ సక్సెస్‌ తర్వాత ఈ సినిమా భారీ అంచనాలు తెచ్చుకున్నా, ప్రస్తుతం బిజినెస్ పై కూడా అస్పష్టత నెలకొంది. లైకా ఒంటరిగా ఈ సినిమాను పూర్తిచేయలేకపోతుండటంతో జెమినీ ఫిల్మ్‌ సర్క్యూట్స్‌, గోకులం ప్రొడక్షన్స్‌ లాంటి సంస్థలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా జరిగిందా లేక వ్యాపార వ్యూహమేనా? అనే అంశంపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

గతంలోనూ లైకా ప్రొడక్షన్స్‌పై ఆర్థిక ఇబ్బందుల ప్రచారం సాగింది. కానీ అప్పుడు అవన్నీ గాసిప్‌లుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు తక్కువ బడ్జెట్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టడం, ఇతర నిర్మాణ సంస్థల సాయాన్ని ఆశ్రయించడం చూస్తుంటే ఈ సంస్థ అసలు స్థాయి మారిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి, లైకా తిరిగి అదే స్థాయిలో నిలబడుతుందా లేక చిన్న సినిమాలతోనే ముందుకు సాగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus