దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ (Sripathi Panditharadhyula Charan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఎల్వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్” (LYF- Love Your Father). పవన్ కేతరాజు (Pavan Ketharaju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా శ్రీహర్ష (Sri Harsha) హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ప్రమోషన్స్ లెవల్లో అలరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: ప్రతి మనిషి జీవితంలో పుట్టుక తర్వాత అంత్యంత కీలకమైనది చావు. ఆ చావుకి గౌరవం ఇవ్వాలి అనేది బాధ్యతగా భావించే వ్యక్తి కిషోర్ (ఎస్పీ చరణ్). అందుకే అనాథలా ఎవ్వరూ మరణించకూడదు అనే ధ్యేయంతో, ఎవరు లేని వారికి అన్నీ తానై దహనసంస్కారాలు నిర్వహిస్తుంటాడు. అతని కొడుకు సిద్ధు (శ్రీహర్ష) కూడా తండ్రి బాటలోనే నడవడానికి సన్నద్ధమవుతాడు.
కట్ చేస్తే.. గ్యాంబ్లింగ్ మాఫియా నడిపే కబీర్ (నవాబ్ షా (Nawab Shah) Sripathiఊహించని రీతిలో తండ్రీకొడుకులు కిషోర్-సిద్ధు మీద దొంగ కేసులు బనాయించి, వాళ్లని కార్నర్ చేస్తాడు. అసలు కబీర్ తో వీళ్లకి సంబంధం ఏమిటి? అతడ్ని ఎలా ఎదిరించారు? ఈ క్రమంలో వాళ్లు కోల్పోయిందేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవ్ యువర్ ఫాదర్” చిత్రం.
నటీనటుల పనితీరు: నటుడిగా అందరికంటే మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న వ్యక్తి ఛత్రపతి శేఖర్. ఈ సినిమాలో అతడు పోషించిన అఘోరా పాత్రలో అతడి ముఖాన్ని గుర్తించడం కష్టమే అయినప్పటికీ.. తన వాయిస్ మాడ్యులేషన్ తో, స్క్రీన్ ప్రిజన్స్ తో సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు.
ఎస్పీ చరణ్ లో పెద్దరికం, ఆప్యాయత వంటివి స్పష్టంగా కనిపించాయి. అయితే.. హావభావాల ప్రకటన విషయంలో ఇంకాస్త పరిణితి అవసరం. చాలా సన్నివేశాల్లో ఆయన నటన అసహజంగా ఉంది. అయితే.. సదరు పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ & సెకండాఫ్ ఎమోషన్స్ మాత్రం బాగున్నాయి. శ్రీహర్ష మొదటి సినిమా అయినప్పటికీ.. పర్వాలేదనిపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో మంచి మెచ్యూరిటీ ప్రదర్శించాడు. సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ లో ఎస్పీ చరణ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగా పండాయి కూడా.
ప్రవీణ్ కి చాలారోజుల తర్వాత పెద్ద పాత్ర దొరికింది. కాస్తంత కామెడీ కూడా పండించాడు. కషికా కపూర్ (Kashika Kapoor) లిప్ సింక్ ఇవ్వలేక, సరైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టలేక తాను ఇబ్బందిపడి, ప్రేక్షకుల్ని కూడా ఇబ్బందిపెట్టింది. నవాబ్ షా విలన్ గా అలరించడానికి ప్రయత్నించాడు కానీ.. అతని పాత్రకి రాసిన డైలాగ్స్ మైనస్ గా మారాయి.
సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ బాణీలు సోసోగా ఉండగా, నేపథ్య సంగీతం మాత్రం సినిమాలోని ఎమోషన్ ను ఎలివేట్ చేసింది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని ప్రతి ఫ్రేమ్ లో చెప్పకనే చెప్పాడు శ్యామ్ కే.నాయుడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ తమ బెస్ట్ వర్క్ ఇచ్చారు. డి.ఐ & మిక్సింగ్ వంటి టెక్నికాలిటీస్ కూడా బాగున్నాయి.
దర్శకుడు పవన్ కేతరాజు ఎంచుకున్న కోర్ పాయింట్ బాగుంది. తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా హృద్యంగా తెరకెక్కించాడు. సెకండాఫ్ లో వచ్చే ఫన్ & ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే.. కథలో విలన్ క్యారెక్టర్ ను ఇరికించిన విధానం మాత్రం సింక్ అవ్వలేదు. మెల్లగా సాగుతున్న కథనంలోకి ఆత్రంగా పాత్రలను, ట్విస్టులకు ఇరికించినట్లుగా ఉంటుంది. అలాగే.. కీలకమైన సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. ప్రవీణ్-భద్రం-షకలక శంకర్ కాంబినేషన్ కామెడీ సీన్స్ కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా దర్శకుడు పవన్ కేతరాజు తన మొదటి ప్రయత్నంలో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: కొన్ని పాయింట్స్ పేపర్ మీద ఆసక్తికరంగా ఉంటాయి, వాటి ఎగ్జిగ్యూషన్ లో ఎమోషన్ మిస్ అయితే సినిమా ఆడియన్స్ ను అలరించడానికి ఇబ్బందిపడాల్సి వస్తుంది. “లవ్ యువర్ ఫాదర్” పరిస్థితి కూడా అంతే. కథను మొదలుపెట్టిన తీరు చూసి ఇదేదో ఆసక్తికరంగా ఉంటుంది అనిపించగా, మధ్యలో వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్ కథనాన్ని కాస్త గాడి తప్పించగా, ఇంటర్వెల్ మళ్లీ చిన్నపాటి ఆసక్తి కలిగించింది. సెకండాఫ్ మొదట్లో మళ్లీ బాగుంది అనిపించేలోపు అనవసరమైన కామెడీ ఎపిసోడ్స్ తో మళ్లీ గాడి తప్పింది. ఆ కామెడీ ఎపిసోడ్స్ ను ఇరికించకుండా, తండ్రీకొడుకు పాత్రల మధ్య ఎమోషన్ ను ఇంకాస్త బాగా వర్కవుట్ చేసి ఉంటే “లవ్ యువర్ ఫాదర్” కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించేది. అవి లోపించడంతో ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: పాయింట్ మంచిదే.. ఇంకాస్త బాగా తీసుండొచ్చు!
రేటింగ్: 2/5