సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తన ఉనికిని చాటుకొనే తాజా ప్రయత్నం “మా నాన్న సూపర్ హీరో” (Maa Nanna Superhero) . కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి సెన్సిబుల్ & ఫాదర్ సెంటిమెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. “లూజర్” వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 11న విడుదలవుతుండగా.. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్ షోస్ వేశారు చిత్రబృందం. మరి ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు మంచి హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!
కథ: చిన్నప్పుడే తండ్రి అనాథాశ్రమంలో వదిలేయడంతో, అనాథగా పెరిగిన జానీ (సుధీర్ బాబు)ని చిన్నతనంలోనే బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ (షాయాజీ షిండే) (Sayaji Shinde) దత్తత తీసుకుంటాడు. అయితే.. జానీని దత్తత తీసుకున్న తర్వాత అంతా చెడే జరిగిందని నమ్మి, జానీని చాలా హీనంగా చూస్తుంటాడు శ్రీనివాస్. కానీ.. తండ్రి మీద విపరీతమైన ప్రేమ, గౌరవంతో ఎన్ని మాటలు అన్నా తండ్రి ఎప్పడు ప్రేమగా పిలుస్తాడా అని ఎదురుచూస్తుంటాడు జానీ.
అయితే.. తండ్రి చేసిన తప్పుకు 20 రోజుల్లో కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు జాని ఏం చేశాడు? అసలు జానీ అసలు తండ్రి అతడిని ఎందుకు వదిలేసి వెళ్లాడు? అనేది “మా నాన్న సూపర్ హీరో” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: సుధీర్ బాబు ప్రతి సినిమాకి పరిణితి చూపుతున్నాడు. అతడి 18 సినిమాల ప్రయాణంలో నటుడిగా చెప్పుకోదగ్గ సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఎక్కడా అతి లేకుండా చాలా సింపుల్ నటనతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా సుధీర్ బాబు సినిమా మొత్తంలో ఎక్కడా షర్ట్ విప్పలేదు. “ఫిదా, సైరా” ఫేమ్ సాయిచంద్ (Sai Chand) మాత్రం పాత్రలో జీవించేశాడు. కొడుకు కోసం వెతికే తండ్రిగా ఆయన కళ్ళల్లో పలికిన హావభావాలు చాలా సహజంగా ఉన్నాయి. అలాగే.. ప్రీక్లైమాక్స్ సీన్ లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది.
షాయాజీ షిండే ఈ క్యారెక్టర్ కి న్యాయం చేసినా, ఆ పాత్రలో రావు రమేష్ (Rao Ramesh) లాంటి నటుడైతే ఇంకాస్త కనెక్ట్ అయ్యేవారు ప్రేక్షకులు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం (Raju Sundaram) కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ అర్ణా ఒక పాట, రెండు సీన్లకు పరిమితం అయిపోయింది. “రాజన్న” ఫేమ్ అని (Baby Annie) ఈ చిత్రంలో మంచి సహాయ పాత్రలో కనిపించింది. హర్షవర్ధన్ (Harsha Vardhan) , విష్ణు ఓయ్, జాన్సీ (Jhansi) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అభిలాష్ కంకర ఒక సింపుల్ స్టోరీని, ఎమోషనల్ గా ప్రెజంట్ చేయాలనుకున్నాడు. అందుకు తండ్రీకొడుకుల మధ్య ఉండే కామన్ ఎమోషన్ ను మూలకథగా ఎంచుకున్నాడు. సుధీర్ బాబు & షాయాజీ షిండే నడుమ కెమిస్ట్రీని ఎలివేట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా ఎలాంటి అసభ్యతకు, మతిలేని పోరాట సన్నివేశాలకు తావు లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించడంలో అభిలాష్ విజయం సాధించాడు. మరీ ముఖ్యంగా నేటి సమాజంలో మనుషులు మర్చిపోతున్న మానవతా బంధాలను, మానవీయ విలువలను చక్కగా చూపించిన విధానం బాగుంది.
అయితే.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. మరీ సింగిల్ లైన్ స్టోరీ కావడంతో 127 నిమిషాల సినిమా కూడా చాలా చోట్ల బాగా సాగింది. జయ్ క్రిష్ పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించుకోగా, సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగున్నాయి.
విశ్లేషణ: “మా నాన్న సూపర్ హీరో” కచ్చితంగా మనసుల్ని హత్తుకునే కథా బలమున్న చిత్రం. సుధీర్ బాబు నీట్ పెర్ఫార్మెన్స్, అభిలాష్ కంకర టేకింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. అయితే.. కథనంలో కాస్తంత వేగం, కథలో కాస్తంత కనెక్టివిటీ మిస్ అవ్వడంతో ఆడియన్స్ సినిమాతో ట్రావెల్ చేయలేకపోతారు. సుధీర్ బాబు కెరీర్ లో మాత్రం చెప్పుకోదగ్గ సినిమాగా నిలుస్తుంది.
ఫోకస్ పాయింట్: మానవతా విలువల ఆవశ్యకతను తెలియజెప్పిన హృద్యమైన చిత్రం.
రేటింగ్: 2.5/5