MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?
- May 6, 2026 / 09:24 PM ISTByFilmy Focus Desk
MAA ఒక్కటే.. ఇతర MAAలు నమ్మొద్దు.. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) నుండి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అసలు ఏమైంది, ఎందుకు ఇలా ప్రకటన విడుదల చేశారు అంటూ టాలీవుడ్‌లో, తెలుగు సినిమా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన, అధికారిక సంఘం MAA ఒక్కటే అని అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
MAA
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో అనుబంధంగా ఉన్న ఏకైక తెలుగు నటీనటుల సంఘం MAA అని కూడా క్లారిటీగా ఆ ప్రకటనలో ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌ల సమన్వయంతో పనిచేసే ఏకైక కళాకారుల సంఘం MAA. మా సభ్యుల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి, ప్రాతినిధ్యం వహించడానికి, కాపాడటానికి మేము ఒక ఏకీకృత సంస్థగా పనిచేస్తాం అని MAA చెప్పుకొచ్చింది.
ఈ ప్రకటనకు కారణం ఏంటా అని చూస్తే.. కొంతమంది వ్యక్తులు, గ్రూప్‌లు MAA పేరును దుర్వినియోగం చేస్తున్నారట. కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేయడానికి AP MAA, MAA AP లాంటి పేర్లతో కొత్త అసోసియేషన్‌లు ఏర్పాటు చేస్తున్నాం అంటూ కొంతమంది నటులను కలుస్తున్నారట. దీంతో ‘మా’ సభ్యుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయట. దీనిపై క్లారిటీ ఇవ్వడం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ప్రకటన చేసింది.










