“మాచర్ల నియోజక వర్గం”.. ఈ సినిమా టీజర్, ట్రైలర్, కనీసం టైటిల్ కూడా జనాల్లోకి వెళ్లకపోయినా.. పాపం డైరెక్టర్ పెట్టిన ఓ పాత ట్వీట్ మార్ఫింగ్ ఫోటో మాత్రం భీభత్సంగా వైరల్ అయ్యింది. నితిన్-కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 12) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ నిర్వహించడం అనేది పెద్ద టాస్క్. ఈ టాస్క్ ను నిర్వర్తించడానికి నియమించబడిన ఐ.ఏ.ఎస్ అధికారి సిద్ధార్ధ్ రెడ్డి (నితిన్). రాజప్ప (సముద్రఖని)ని ఎదిరించి మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. ఈ అనితరసాధ్యమైన విషయాన్ని ఐ.ఏ.ఎస్ సిద్ధార్ధ్ రెడ్డి ఎలా సాధించాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: “లై” తర్వాత నితిన్ మళ్ళీ కొత్తగా కనిపించాడు. నటన & డైలాగ్స్ విషయంలో పెద్దగా మార్పు లేకపోయినా.. లుక్స్ తో కాస్త కన్విన్సింగ్ గా కనిపించి అలరించాడు. నితిన్ స్వతహా భారీ డైలాగులు చెప్పడానికి కాస్త ఇబ్బందిపడతాడు. కానీ ఈ చిత్రంలో భారీ పంచ్ డైలాగులు కూడా అవలీలగా చెప్పాడు. ఈ సినిమాతో ఇదో ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి.
కృతి శెట్టి, కేతరీన్ లు అందాల ఆరబోతకు మాత్రమే ఉన్నారు కానీ.. వారి పాత్రలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఇక విలన్ గా సముద్రఖని క్యారెక్టర్ ఒక రాజగోపాలరావు పోషించిన అలనాటి విలన్ పాత్రలను గుర్తు చేస్తుంది. సురేందర్-నరేందర్లుగా రాజేంద్రప్రసాద్ & మురళీశర్మలు చేసిన కామెడీ నవ్వించలేకపోయింది. ఇక వెన్నెలకిషోర్ కామెడీ చేస్తున్నా అనే భ్రమలో రోత పుట్టించాడు.
సాంకేతికవర్గం పనితీరు: మహతి స్వరసాగర్ నేపధ్య సంగీతం బాగుంది, పాటలు సోసోగా ఉన్నా.. ఓవరాల్ గా పర్వాలేదనిపించాయి. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. దర్శకుడు-కథకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాసుకున్న కథ-కథనంలో చాలా లాజిక్స్ & సెన్సిబిలిటీస్ మిస్ అయ్యాయి. సిద్ధార్డ్ రెడ్డి వెర్సెస్ రాజప్ప ఎపిసోడ్స్ ను రాసుకున్న విధానంలో ఎలాంటి ఆసక్తి లేకుండాపోయింది. ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఇంత సులభమా? అనే రీతిలో సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం అతడి దర్శకత్వ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. ఇక పాటల ప్లేస్ మెంట్ & కామెడీ ట్రాక్ మరో పెద్ద మైనస్.
విశ్లేషణ: “బింబిసార, సీతారామం”తో టాలీవుడ్ కి వచ్చిన సక్సెస్ స్ట్రీక్ ను “మాచర్ల నియోజకవర్గం” కంటిన్యూ చేయలేకపోయిందనే చెప్పాలి. నితిన్ కెరీర్లో మరో బిలో యావరేజ్ సినిమాగా ఈ చిత్రం మిగిలిపోయింది.
రేటింగ్: 2/5