ఒకప్పుడు ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమా మరో ఇండస్ట్రీలో ఆటోమేటిక్‌గా హిట్ అయిపోయేది. డివైడ్ టాక్ అనేది కూడా చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మనుషులు మారిపోయారు. వారి అభిరులు మారిపోయాయి. దీంతో ఏ సినిమా కూడా ష్యూర్ షాట్‌గా ఈ ఫలితం సాధించింది అని చెప్పడం చాలా కష్టం అవుతోంది. పాన్ ఇండియా లెవల్, మల్టీ లాంగ్వేజ్‌లో విడుదలవుతున్న సినిమాల ఫలితాల్ని తేల్చడం అంత ఈజీగా కుదరడం లేదు. అలాగే ఒక రోజు ప్రేక్షకుల రియాక్షన్ బట్టి సినిమా ఫలితాన్ని అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.
దీనికి తాజా ఉదాహరణగా రెండు సినిమాలను చెప్పుకోవచ్చు. ఒకటి శివకార్తికేయన్ – మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన ‘మదరాసి’ ఒకటైతే.. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హిందీ సినిమా ‘బాఘి 4’. ఈ రెండు సినిమాలు గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తొలి రోజుల్లో మన దగ్గర విన్న టాక్, కనిపించిన ఫలితాల ప్రకారం అయితే ఈ రెండు సినిమాలు ఆయా టీమ్‌లకు గట్టి షాక్ ఇచ్చినవే. కానీ ఇప్పుడు చూస్తే కొత్త వారంలో సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయట. అయితే ఇక్కడ కాదు వాటి బేస్ లాంగ్వేజ్ ఇండస్ట్రీల్లో.
‘మదరాసి’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో చూసి చాలా మంది పెదవి విరిచారు. కానీ తమిళనాడులో సినిమాకు మంచి వసూళ్లే కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో, కొత్త వీక్ ప్రారంభంలో సినిమాకు మంచిగానే టికెట్లు తెగాయి అని చెబుతున్నారు. గత కొన్నేళ్లలో తమిళంలో టాప్ స్టార్లు నటించిన సినిమాలు మన దగ్గర ఆడలేదు. కానీ తమిళంలో బాగా ఆడాయి. విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘లియో’, ‘వారిసు’.. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘వలిమై’ సూర్య ‘రెట్రో’కి కూడా ఇలాంటి రియాక్షన్లే వచ్చాయి.
ఇక బాలీవుడ్‌లో మరో రకం పరస్థితి. టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘి 4’ సినిమాకు నెగిటివ్ టాకే వచ్చింది. హింస పాళ్లు ఎక్కువయ్యాయని చాలా మంది చెప్పారు. కానీ వీకెండ్‌లో ఈ సినిమాకు బాగానే వసూళ్లు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే మీకు నచ్చింది.. మాకు నచ్చదు అని అనకమానరు.