ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే రా అండ్ రస్టిక్ చిత్రం `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` : దర్శకుడు మల్లి

  • October 12, 2023 / 09:13 AM IST

శివ కంఠ‌మ‌నేని హీరోగా `భ‌ద్రాద్రి`, `క‌త్తి` చిత్రాల ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`. మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించింది. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. రా అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లతో పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌ దర్శకుడు మల్లి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు…

`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` సినిమా నేపథ్యం, కథ ఏంటి?
– ప్రతీ మనిషికి ఒక ఆత్మ ఉంటుంది.. అలానే ఓ ఊరికి కూడా ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది.. దాని కథ ఏంటి? అనేది  సినిమాలో చూపించాం. తన కథను తాను చెప్పుకునే గ్రామం క‌నుక‌నే `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను అని టైటిల్ పెట్టాం. ఒక డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా  చేద్దాం అనే ఊహలోంచి పుట్టిన కథే `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`.

`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` సినిమాకు స్పూర్తినిచ్చిన అంశం ఏంటి?
– నా చిన్నతనంలో ఓ స్టోరీ విన్నాను. ఓ వ్యక్తి తలను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని విన్నాను. ఆ విజువల్ నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. దాన్ని అల్లుకుని ఈ కథను రాసుకున్నాను. కానీ ఆ ఘటనకు ఈ సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు.

ఈ చిత్రం చూస్తుంటే పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తోంది? ప్రేమ కథను ఎలా డీల్ చేశారు?
– ఇది ఒక ఊరిలో జ‌రిగిన క‌థ కాబ‌ట్టి `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` అనే చిత్రంలో స్నేహం, పాలిటిక్స్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్ ఇలా ఒక ఊరిలో ఎమైతే  ఎగ్జ‌యిటింగ్ అంశాలు ఉంటాయో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్ల మ‌ధ్య ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` ప్రాజెక్ట్‌లోకి మణిశర్మ ఎలా వచ్చారు? ఆయన సంగీతం ఎలా ఉంది?
– మణిశర్మ గారితో నాకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది. సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన ప్రశంసించారు. ఆయన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారుతుంద‌ని న‌మ్ముతున్నాను.

కొత్త టీంతో సినిమా చేయడం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది?
– కొత్త వాళ్లు అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలను అని భావించాను. రా అండ్ రస్టిక్‌గా ఉండే ఈ కథకు కొత్త వాళ్లైతేనే బాగుంటుందనిపించింది.

సెన్సార్ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
– `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` సినిమాకు సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఒక్క బూతు పదం కూడా వాడ‌లేదు.. కానీ ఆ వయలెన్స్ సీన్ల వల్లే ఏ సర్టిఫికేట్ ఇచ్చామని అన్నారు. కానీ ఆ సీన్లు లేకపోతే థియేటర్లో ఆ ఎక్స్‌పీరియెన్స్, ఎమోషన్ కన్వే కాదు. అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చినా పర్లేదని అన్నాను.

హీరో శివ కంఠమనేని ఈ కథలోకి ఎలా వచ్చారు?
– ఈ కథను కొత్త వారితోనే చేద్దామని అనుకున్నాను. అలా కథను రాసుకుంటున్న సమయంలోనే శివ కంఠమనేని గారిది ఓ పోస్టర్ చూశాను. భలే రగ్డ్‌గా ఉన్నారు. నా కథకు ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారు కదా? అని అప్రోచ్ అయ్యాను. కథ విన్నారు. ఆయనకు బాగా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.

కళ్యాణ్ రామ్‌తో మళ్లీ కథను చెప్పారా?
– కళ్యాణ్ రామ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. కానీ ఆయనతో చేసిన  షేర్ సినిమా అంతగా ఆడలేదు.  అలాంటప్పుడు ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్‌ను వాడుకుని ఇంకో కథ చెప్పాలని అనుకోవడం లేదు. నేను మళ్లీ సక్సెస్ అయ్యాక.. కళ్యాణ్ రామ్ గారికి కథ చెబుతాను. అభిమన్యు, కత్తి, షేర్ సినిమాల్లో.. కత్తి కమర్షియల్‌గా నిర్మాతకి లాభాలు తీసుకొచ్చింది.

శివ కంఠమనేని గారి క్యారెక్ట‌ర్ గురించి?
– సూరి పాత్రని శివ కంఠమనేని గారు అద్భుతంగా పోషించారు. ఆ క్యారెక్ట‌ర్ కోసం నెల్లూరు యాసను ప్రాక్టీస్ చేశారు. సూరి పాత్ర ఎలా ప్రవర్తిస్తుంటుందో.. శివ గారు కూడా అలానే ప్రవర్తించారు. ఈ పాత్రకు శివ గారు పూర్తిగా న్యాయం చేశారు. దర్శకుడికి ఏం కావాలో తెలుసుకుని చక్కగా నటించారు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా డైరెక్ట‌ర్స్ యాక్ట‌ర్ అని చెప్పొచ్చు.

మీ గత చిత్రాల‌కు, ఈ సినిమాకు చాలా తేడా ఉంది? ఇంత మార్పు ఎందుకు వచ్చింది?
– కరోనా త‌ర్వాత  ప్రేక్షకుల అభిరుచి మారింది. రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తే జనాలు చూడటం లేదు. అందుకే ఏదైనా కొత్తగా ఉండాలనే ఈ కథను రాసుకున్నాను.

ఈ సినిమాలోని హైలెట్స్ గురించి చెప్పండి?
– సినిమా మొద‌లు కాగానే మధురపూడి గ్రామంలోకి ప్రేక్షకుడు ప్రయాణిస్తాడు. ఏదో ఒక పాత్రతో ప్రతీ ఒక్క‌రూ కనెక్ట్ అవుతారు. గంట నలభై నిమిషాలు నెక్ట్స్ ఏం జ‌ర‌గ‌బోతుందా అని ఉత్కంఠ‌త‌తో చూస్తారు. బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఒక మంచి సినిమా చూశాం అనే ఫీల్‌తో వ‌స్తారు.

హీరోయిన్ , నిర్మాతల గురించి చెప్పండి?

హీరోయిన్ క్యాథ‌లిన్ గౌడ పూర్తిగా డీ గ్లామరస్ రోల్ లో కనిపించింది. నేను అనుకున్నదానికంటే కూడా చాలా చక్కగా నటించింది. ఇక నిర్మాతలు కె.శంకర్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు టెక్నికల్ నేను అడిగినవన్నీ అందించి సినిమాకి ఓ గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు.

మీ ద‌గ్గ‌ర ఏడీగా చేసిన డైరెక్ట‌ర్లు మంచి స్థాయిలో ఉన్నారు.. మీకు ఎలా అనిపిస్తుంది?
– నేను పూరి జగన్నాథ్ గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేశాను. బాబీ నా దగ్గర పని చేశాడు. బాబీ మంచి స్థాయిలో ఉన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను, బాబీ, వక్కంతం వంశీ ఒకే టైంలో కలిసి పని చేశాం. నా వాళ్లు ఎదిగితే నాకూ సంతోషంగానే ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus