తండ్రీకొడుకులు విక్రమ్-ధృవ్ విక్రమ్ కలిసి నటించిన సినిమా “మహాన్”. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 10) అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మీద ఎందుకో మొదటినుంచి పెద్దగా అంచనాల్లేవు. డైరెక్టర్ కార్తీక్ ట్రాక్ రికార్డ్ వల్ల కావచ్చు, విక్రమ్ ట్రాక్ వల్ల కావచ్చు.. “”మహాన్” టీజర్ & ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. మరి సినిమా సంగతేంటో చూద్దాం..!!
కథ: గాంధీ మహాన్ (విక్రమ్) గాంధేయుల కుటుంబానికి చెందినవాడు. 40 ఏళ్ల పాటు మంచోడిగా ఉండి ఉండీ బోర్ కొట్టేసి.. తన అసలైన పుట్టినరోజునాడు మనస్ఫూర్తిగా మందు తాగి, జూదమాడి జీవితంలో చేయలేకపోయినవన్నీ ఒకేరోజు చేసేస్తాడు. దాని పర్యవసానంగా భార్య పిల్లలకు దూరమవుతాడు. అప్పటివరకూ స్కూల్ మాస్టర్ గా జీవితాన్ని గడిపిన మహాన్.. సత్యవాన్ (బాబీ సింహా)తో కలిసి లిక్కర్ బిజినెస్ మొదలెట్టి, లిక్కర్ కింగ్ అవుతాడు. ప్రభుత్వాన్ని ఎదిరించి, అదే ప్రభుత్వంతో కలిసి తిరుగులేని రాజుగా ఎదుగుతాడు.
కట్ చేస్తే.. చిన్నప్పుడు దూరమైన మహాన్ కొడుకు దాదాభాయ్ (ధృవ్ విక్రమ్) తండ్రి మీద కోపం/అసహ్యంతో తిరిగి వస్తాడు. మహాన్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా పోలీస్ ఆఫీసర్ గా ఎంటరైన దాదా & మహాన్ ల నడుమ పోరు ఎలా సాగింది? అనేది “మహాన్” కథాంశం.
నటీనటుల పనితీరు: విక్రమ్ చాన్నాళ్ల తర్వాత ప్రయోగాలు, అనవసరమైన వేరియేషన్స్ కు పోకుండా.. కేవలం నటనతో ఆకట్టుకున్నాడు. మహాన్ గా విక్రమ్ క్యారెక్టర్ & పెర్ఫార్మెన్స్ అదిరిందనే చెప్పాలి. క్యారెక్టర్ ఆర్క్ లో కాస్త క్లారిటీ మిస్ అయినప్పటికీ.. గాంధేయవాదం-ఎక్స్ ట్రిమిస్ట్ ఒకే వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటుంది అనే థియరీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లా మహాన్ క్యారెక్టర్ ఉంటుంది.
అలాగే.. చిన్నప్పటినుండి మనసులో విద్వేషాన్ని నింపుకున్న ఓ యువకుడిగా ధృవ్ విక్రమ్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. నిజానికి మహాన్ కంటే బాబా క్యారెక్టరైజేషన్ జనాలకి త్వరగా అర్ధమవుతుంది. తండ్రీకొడుకులిద్దరూ పోటీపడి నటించారు. ఇద్దరి నడుమ పోటీ చూడ్డానికి కొత్తగా ఉండడం మాత్రమే కాక.. కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యింది.
సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన బెస్ట్ ఫిలింగా మహాన్ ను చెప్పుకోవచ్చు. విలువలు-బాంధవ్యాల నడుమ నలిగిపోయే ఓ సగటు మహిళగా సిమ్రాన్ తన సీనియారిటీని ప్రూవ్ చేసుకుంది. బాబీ సింహా, సనంత్ లు సపోర్టింగ్ రోల్స్ లో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం. సినిమాలో కంటెంట్ లేని చాలా చోట్ల తన సంగీతంతో ఎలివేషన్ ఇచ్చాడు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సంతోష్ నారాయణ్ బ్రిలియన్స్ భేష్ అని చెప్పాలి. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ విషయంలో చాలా జాగ్రత్త వహించారు. డీటైలింగ్ విషయంలో మహాన్ టీం తీసుకున్న శ్రద్ధ ప్రశంసార్హం.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన ప్రతి సినిమాతో ఒక ప్రయోగం చేస్తాడు. కొన్ని కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయి, కొన్ని అవ్వవు. ఆ అవ్వని వాటి జాబితాలోకే “మహాన్” కూడా వస్తుంది. కానీ.. గాంధేయవాదం మరియు భిన్నవాదాల నడుమ ఒక సన్నటి రేఖను వివరించేందుకు తండ్రీకొడుకుల మధ్య వైరాన్ని కథాంశంగా ఎంచుకున్నాడు. దాదాపుగా విజయం సాధించాడు కానీ.. క్యారెక్టర్స్ & సిచ్యుయేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం దాదాపు గంట సమయం తీసుకోవడం అనేది మైనస్ అయ్యింది. నిజానికి విక్రమ్-ధృవ్ లతో ఒక మాస్ యాక్షన్ సినిమా తీసినా ఆడేసేది. అలాంటిది వాళ్ళిద్దరినీ భిన్న భావాలు-మనస్తత్వాలు కలిగిన వ్యక్తిగా చూపించడం, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ తో విలన్ వెర్సెస్ విలన్ థీమ్ ను ఎలివేట్ చేయడం అనేది అభినందనీయం.
అయితే.. దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ పనితనాన్ని ఎప్పటికప్పుడు మెచ్చుకున్నా.. కథకుడిగా మాత్రం అతడి పనితనంలో దొర్లిన తప్పులు లెక్కలేనన్ని. రాసుకున్న కథ-సన్నివేశాలపై ప్రేమ ఎక్కువై.. ఎడిట్ టేబుల్ దగ్గర కూడా ఆ ప్రేమ కంటిన్యూ అవ్వడంతో సినిమా ఫస్టాఫ్ మొత్తం సాగతీతలా ఉంటుంది. సెకండాఫ్ లో తండ్రీకొడుకుల నడుమ పోరును పరాకాష్టకు తీసుకెళ్లినప్పటికీ.. కథలో మేజర్ ట్విస్ట్స్ ను డీల్ చేసిన విధానం సోసోగా ఉంది. ఇద్దరు మహా తెలివిగలవాళ్లు ఒకర్నొకరు మరీ ఇంత లాజిక్ లెస్ గా మోసం చేసుకోవడం అనేది హాస్యాస్పదమైన విషయంగా కనిపిస్తుంది.
విశ్లేషణ: కమర్షియల్ సినిమాలకు లాజిక్స్ అవసరం లేదు సరే.. కానీ డ్రామాస్ కు లాజిక్స్ అనేవి చాలా అవసరం. ముఖ్యంగా ఎలివేషన్స్ తోపాటు ఎమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయడంలో కార్తీక్ సుబ్బరాజు దారి తప్పాడు. అందువల్ల విక్రమ్-ధృవ్ ల నట విశ్వరూపాలు తెరపై కనిపిస్తున్నా.. కథ-కథనంలో పట్టు లేకపోవడంతో అవి వేస్ట్ అయిపోయాయే అనే భావన కలుగుతుంది. సో, విక్రమ్ & ధృవ్ ల పోటాపోటీ నటన కోసం “మహాన్”ను ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2/5