నిన్నటితరం అగ్ర కథానాయకి, తెలుగు-తమిళ-మలయాళ భాషల్లోని అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించిన కథానాయకి, నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, గాయనిగా ప్రేక్షకుల్ని ఓలలాడించిన కథానాయకి.. ఆమే సావిత్రి, మనందరి “మహానటి”. ఆవిడ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే “మహానటి”. “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయం మీద ఎవరికీ ఆసక్తి లేదు.. అందరి దృష్టీ ఒకే ఒక్క విషయం మీద ఉంది.. అదే సావిత్రిగారి జీవితాన్ని ఎంత అందంగా, అర్ధవంతంగా తెరకెక్కించారు? అని మాత్రమే. మరి నాగఅశ్విన్ “మహానటి”ని ఎలా చూపించాడో చూద్దాం..!!!
కథ : ప్రత్యేకించి ‘కథ’ అని చెప్పడానికి ఇదేమీ కమర్షియల్ సినిమా కాదు, అలాగని ఆర్ట్ సినిమా అంతకన్నా కాదు. ఒక మహోన్నతమైన వ్యక్తి జీవితం. ఆమె బాల్యంలోని పెంకితనం, యుక్తవయసులో చేసిన అల్లరి, ఎదిగిన తర్వాత ఆమె చూపిన మొండితనం, అవసరార్ధుల పట్ల ఆమె చూపిన జాలి, తన అనుకున్నవాళ్ల మీద చూపిన కరుణ, ప్రేమించినవాడి కోసం మదన పడిన క్షణం నుంచీ.. అదే ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి మోసం చేశాడని పడిన ఆవేదన, కోటీశ్వరురాలుగా అన్నీ అనుభవించి.. అణాకారిగా మిగిలిపోయిన అభినేత్రి జీవితానికి చిత్రరూపమే “మహానటి”.
నటీనటుల పనితీరు : ఏ క్షణాన దర్శకుడు నాగఅశ్విన్ “తొడరీ” (తెలుగులో “రైల్”) సినిమాలో కీర్తిసురేష్ ను చూసి ఆమె మాత్రమే మహానటి పాత్ర పోషించేందుకు సరిపోతుందని నమ్మాడో తెలియదు కానీ.. కీర్తి సురేష్ మాత్రం మహానటి సావిత్రి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసింది. అసలు సావిత్రి అనే నటి ఎలా ఉంటుందో తెలియని ప్రస్తుత తరాలకు, భవిష్యత్ తరాలకు “మహానటి” అంటే కీర్తి సురేష్ అని చెప్పుకొనే స్థాయిలో ఆమె పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. అసలు కీర్తి నటించగలుగుతుందా అని అనుమానపడిన వారిలో నేను ఒకడ్ని అలాంటిది.. ఈ పాత్ర ఆమె తప్ప ఎవరూ చేయలేరు అనుకొనేలా చేయగలిగిందంటే.. నటిగా కీర్తి సురేష్ ఈ ఒక్క సినిమాతో వంద మెట్లు ఎక్కినట్లే. ఒకట్రెండు షాట్స్ లో ప్రోస్తెటిక్ మేకప్ కాస్త ఎక్కువైంది అనిపించిందే తప్ప.. ఆమెను చూస్తున్నంతసేపు అచ్చు సావిత్రిగారిని మరోమారు చూసుకున్నట్లే అనిపించింది.
జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ఒక నటుడిగా అతడి గురించి కొత్తగా ప్రశంసించాల్సిందేమీ లేదు. అయితే.. జెమిని గణేషన్ పాత్రలోకి తనను తాను ప్రవేశింపజేసుకొని ఆ పాత్రలో జీవించడం కోసం అతడు పడిన శ్రమను మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. వీరిద్దరి తర్వాత సినిమాలో.. నటనతో ప్రాణం పోసిన వ్యక్తి రాజేంద్రప్రసాద్. కొన్ని ఫ్రేమ్స్ లో కేవలం కళ్ళతో ఆయన పలికించిన హావభావాలు చూశాక అనిపిస్తుంది.. “ఊరికే సీరియర్ యాక్టర్లు అయిపోతారా” అని. మంచానపడిన సావిత్రిని చూస్తూ ఆయన కళ్ళలో పలికే భావమొక్కటి చాలు నటుడిగా ఆయన సామర్ధ్యం ఏమిటో తెలియడానికి. సమంత, విజయ్ దేవరకొండ పాత్రలకు సావిత్రి బయోపిక్ తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. కథను నడిపించింది వీళ్లిద్దరే.. పాత్ర పరిమితమే అయినా ఇద్దరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు.
ఇక ఎస్వీరంగారావుగా మోహన్ బాబు, కె.వి.రెడ్డిగా క్రిష్, ఎల్.వి.ప్రసాద్ గా శ్రీనివాస్ అవసరాల, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్, పెద్దమ్మగా భానుప్రియ, తల్లిగా దివ్యవాణిలు ఎవరి పాత్రల్లో వారు అద్ధుతంగా నటించారు. అందరికంటే ముఖ్యంగా సినిమాలో అక్కినేని నాగేశ్వర్రావుగా నాగచైతన్య నటించిన సన్నివేశాలు బాగున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు : నటీనటుల తర్వాత సినిమాలో ప్రశంసించాల్సిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ డానీ. ఒక సినిమాలో మహా అయితే రెండు టింట్స్ యూజ్ చేసి కాస్త లైటింగ్ ఎఫెక్ట్స్ అటు ఇటు మార్చడానికి నానా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో.. ఒకే సినిమాలో ఏడెనిమిది రంగుల టింట్ ఎఫెక్ట్స్, 50 కాలం నుంచి 80ల దాకా తెలుగు, తమిళ సినిమాల్లో వాడిన అన్నీ రకాల లైట్ ఎఫెక్ట్స్ ను యూజ్ చేస్తూ.. డిజిటల్ కెమెరా మాత్రమే కాకుండా రీల్ కెమెరా కూడా వాడి.. మూడు గంటలపాటు సినిమా చూస్తున్న ప్రేక్షకుడ్ని సినిమాలో తన కెమెరా ఫ్రేమ్స్ తో లీనం చేసిన డానీ లోపెజ్ పనితనాన్ని మామూలుగా మెచ్చుకోవడం కూడా అతడి ప్రతిభను తక్కువ చేసినట్లే అవుతుంది. కీర్తి సురేష్, దుల్కర్, నాగఅశ్విన్ ల తర్వాత సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యకారకుల్లో డానీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించడమే ఈ ఆంగ్ల పనిమంతుడికి తెలుగు సినిమా ఇచ్చే గౌరవం.
ఆర్ట్ వర్క్, ఇంద్రాక్షి పట్నాయక్ కాస్ట్యూమ్స్ సినిమాకి జీవం పోస్తే.. రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఆ జీవాన్ని ప్రేక్షకుల మనసుల్లోకి మోసుకెళ్ళాయి. ఇక “మహానటి” లాంటి చిత్రరాజాన్ని ఈతరానికి అందించడం కోసం ఆహారహం శ్రమించిన నిర్మాతలు అశ్వినీదత్-ప్రియాంకదత్-స్వప్నదత్ ల కష్టానికి ప్రేక్షకుడి కంటి నుండి ఆనందంతో జాలువారే కన్నీటి బొట్లే ప్రతిఫలం.
సాధారణంగా ఒక దర్శకుడి ప్రతిభను పొగడాలంటే సినిమాలో ఫలానా సీన్ బాగా రాసుకొన్నాడు, ఫలానా ఆర్టిస్ట్ నుంచి అద్భుతమైన నటన రాబట్టుకొన్నాడని చెబుతుంటాం. కానీ.. నాగఅశ్విన్ దర్శకత్వ, వ్యక్తిత్వ ప్రతిభ గురించి వర్ణించడానికి ఈ క్షణానికి నాకు మాటలు రాకపోవచ్చు కానీ.. కుదిరితే కేవలం అతడికి సినిమా తీయాలనే ఆలోచన వచ్చిన దగ్గర్నుంచి.. సినిమాని తెరకెక్కించడం కోసం పడిన శ్రమ, సినిమాని తెరకెక్కించిన తీరు గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. “సావిత్రిగారి గురించి కథ రాయాలంటే ఒక అర్హత ఉండాలి” అని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆమె కథ రాయడానికి మించిన అద్భుతమైన అర్హత ఇంకేదో ఉందనుకుంటా నాగఅశ్విన్ దగ్గర అందుకే ఆ “మహానటి” కథను సినిమాగా తీయగలిగాడు. భవిష్యత్ తరాలకు “సావిత్రి”ని సరికొత్తగా పరిచయం చేశాడు. చూడ్డానికి ఏదో సామాన్యుడిలా కనిపించే నాగఅశ్విన్ “మహానటి” సినిమాతో దర్శకుడిగా ఎంత ఎదిగాడో తెలియదు కానీ వ్యక్తిగా మాత్రం శిఖరాగ్ర స్థానానికి చేరుకొన్నాడు.
అతడు తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ లోనూ నిజాయితీ కనపడింది, ప్రతి సన్నివేశంలో సహజత్వం తొణికిసలాడింది. ఇంతకంటే ఒక సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు ఏం కోరుకొంటాడు.
విశ్లేషణ : సాధారణంగా పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి అంటారు. కానీ.. పరిస్థితి ఏదైనా మనిషిగా ఓటమి ఎరుగని ఓ మహోన్నతమైన మనిషి కథే “మహానటి”. ప్రతి సినిమా అభిమాని తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది, భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.
రేటింగ్ : నిజాయితీగల అద్భుత ప్రయత్నం ఈ చిత్రరాజం, రేటింగ్ తో వారి కష్టానికి వెలకట్టలేము.