విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా ‘కింగ్డమ్’. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన ఈ సినిమా తొలి రోజు మంచి టాకే సాధించింది. అయితే వీకెండ్ పూర్తయ్యేసరికి ఆ టాక్ వినిపించడం మానేసింది. ఏమైంది, ఎందుకిలా పరిస్థితి మారింది అనేది సినిమా టీమ్, నిర్మాత నాగవంశీతో కలసి చూసుకుంటారు కానీ.. ఇప్పుడు తమిళనాట ఈ సినిమాకు ఊహించని పరిస్థితి ఎదురైంది. శ్రీలంక తమిళులను నేరచరితులుగా చూపించడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట నామ్ తమిళర్ కట్చి నిర్వాహకులు ఆందోళనలు చేపట్టారు.
‘కింగ్డమ్’ సినిమాలో శ్రీలంక తమిళులను నేరచరితులుగా చిత్రీకరించడాన్ని నామ్ తిళర్ కట్చి నిర్వాహకులు తప్పుపడుతున్నారు. అక్కడి మలైయగ తమిళులను శ్రీలంక తమిళులు అణచివేసినట్లుగా చూపించడం సరికాదు అని అంటున్నారు. ఆ పార్టీతోపాటు మరికొన్ని తమిళనాడు రాజకీయ పార్టీలు, శ్రీలంక తమిళుల సానుభూతిపరుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్రాన్ని ప్రదర్శిస్తే సినిమా థియేటర్లను ముట్టడిస్తామని నామ్ తమిళర్ కట్చి హెచ్చరించడంతో తమిళనాడులోని థియేటర్ల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
కోయంబత్తూరు, రామనాథపురం తదితర ప్రాంతాల్లో నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు థియేటర్ల వద్ద ‘కింగ్డమ్’ పోస్టర్లు, బ్యానర్లను చించేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ సినిమాపై స్టే విధించాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ వైగో డిమాండ్ చేశారు. ఈళం తమిళులు, వారి పోరాటాన్ని వక్రీకరించి చరిత్రను నాశనం చేసే ప్రయత్నం ఈ సినిమా అని ఆయన ఆరోపించారు.
అయితే, మణిరత్నం ‘అమృత’, మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’, శశి కుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలో ఇదే అంశాన్ని టచ్ చేశారని.. అప్పుడు రాని కాంట్రవర్శీ ఇప్పుడెందుకు వస్తోందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ‘కింగ్డమ్’ సినిమా టీమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.