“లేచింది, నిద్రలేచింది మహిళా లోకం” అని “గుండమ్మ కథ”లో ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. అప్పట్లో మహిళా లోకం ఆ పాటని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ.. ఈతరం మహిళలు మాత్రం కాస్త సీరియస్ గానే తీసుకొన్నారు. మగవాళ్ళకి ధీటుగా ప్రతి విషయంలోనూ వారికి పోటీగా నిలవడమే కాదు.. మగాళ్లని మించే స్థాయిలో నిలుస్తున్నారు. అయితే.. అన్నీ రంగాల్లోనూ ముందుకుసాగుతున్న మహిళలు చిత్రసీమలో మాత్రం వెనుకడుగు వేస్తూ వచ్చారు. అప్పుడెప్పుడో భానుమతి, సావిత్రి గార్ల తర్వాత చిత్రసీమలో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ కనిపించి చాలా ఏళ్లవుతోంది.
మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చిత్రసీమలో ఒక్క దర్శకుడు మినహా టీం మొత్తం మహిళా బృందంతోనే ఒక సినిమా తెరకెక్కింది, అదే “మహానటి“. దర్శకత్వం వహించిన “నాగఅశ్విన్” మినహా సినిమా కోసం 21 మంది మహిళలు పని చేయడం విశేషం. ముఖ్యంగా సినిమాకి సంబంధీన కీలకమైన నిర్వహణల్ని మహిళలే చూసుకోవడం విశేషం. సినిమాలోనూ నటించిన మేల్ లీడ్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ల కంటే కీలకపాత్రలు పోషించిన సమంత, కీర్తి సురేష్ లే ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొంటుండడంతో ఈ చిత్రాన్ని మహిళా ప్రాధాన్యమున్న సినిమాగా మాత్రమే కాకుండా మహిళ సాధికార సినిమాగా మిగిలింది. మరి “మహానటి” మంచి విజయం సాధించి చిత్రసీమలో మరిన్ని మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు వస్తాయని ఆశిద్దాం.