సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) 1000 కంటే ఎక్కువమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారనే సంగతి తెలిసిందే. అయితే సితార కూడా మహేష్ బాబు అడుగుజాడల్లో నడుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు సితార ఊపిరి పోయడం ప్రస్తుతం సొషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. సితార వయస్సులో చిన్న అయినా మంచి మనస్సును చాటుకునే విషయంలో ఆమెకు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలని అనుకున్న ఒక పేద విద్యార్థినికి సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. నమ్రత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను పంచుకోవడం జరిగింది. నమ్రత (Namratha Shirodhkar) తన పోస్ట్ లో “దినసరి కూలీ అయిన తండ్రి తన కూతురు నవ్యను చదివించడానికి శక్తివంచన లేకుండా శ్రమించారు.. ఆమె కూడా నీట్ పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది..
నవ్యశ్రీకు డాక్టర్ కావడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయని తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించిందని అయితే లక్ష్య సాధనలో ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలిచింది” అని పేర్కొన్నారు. మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఫౌండేషన్ ద్వారా 1,25,000 రూపాయల చెక్ ను సితార నవ్యశ్రీకి అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సితార నవ్యతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు ఆమెకు ల్యాప్ టాప్, స్టెతస్కోప్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో నవ్య 605 మార్కులు సాధించడం గమనార్హం. నవ్యశ్రీకి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటు వచ్చింది. సితార కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.