మరచిపోవడం మనిషికి దేవుడిచ్చిన వరం అని అంటారు. అయితే ఏం మరచిపోవాలి అనేది మాత్రం ఆ మనిషి ఇష్టం అని అంటారు. సినిమా వాళ్లు ఈ విషయాన్ని మరో విధంగా వాడేస్తుంటారు. హిట్ ఇవ్వని సినిమాను, ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమాను, సినిమా సెట్స్‌లో ఇబ్బందులు పడేలా చేసిన సినిమాను మరచిపోతుంటారు. ఇప్పుడు ఏ కారణంతో ఓ సినిమాను, అందులోని హీరోను వదిలేసిందో తెలియదు కానీ.. బాలీవుడ్‌లో స్థిరపడి పోయిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. మహేష్‌బాబును మరచిపోయింది. ఆయనతో కలసి నటించిన సినిమాను కూడా మరచిపోయింది.
బాలీవుడ్‌లో రీసెంట్ టాప్ హీరోయిన్ల కేటగిరీలోకి వచ్చేసింది కృతి. ఇటీవలే ధనుష్ కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’తో మంచి హిట్ కొట్టింది. ఆ ప్రేమకథా చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇటు అందం, అటు అభినయం పరంగా కృతికి మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఆమెను హైట్ గురించి అడిగారు. మీరు చాలా పొడవున్నారు కదా.. మీతో కలసి నటించిన హీరోల్లో చాలామంది మీ కంటే పొట్టివాళ్లు కదా అని అన్నారు.
దానికి కృతి రియాక్ట్ అవుతూ నా హీరోలు చాలామంది నా కంటే ఎత్తు తక్కువ ఉన్నవారే. ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే నా కంటే పొడవైన వాళ్లు అని చెప్పింది కృతి సనన్. అయితే, ఈ క్రమంలో సౌత్‌లో ఆమె నటించిన ‘వన్: నేనొక్కడిన్’ సినిమాను, ఆ సినిమా హీరో మహేష్‌బాబును మరచిపోయింది. ఆమె బాలీవుడ్‌లో స్టార్ అవ్వడానికి ముందే ఇక్కడ ‘వన్ నేనొక్కడినే’లో నటించింది. అదే ఆమె తొలి తెలుగు సినిమా కూడా.
అందులోనూ తెలుగులో పొడవు ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో మహేష్ ఒకడు. అలాంటిది మహేష్‌ను మరచిపోయి మాట్లాడటం ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఆ సినిమా ఫలితం కారణంగా ఆమె అలా ఏమన్నా మాట్లాడిందేమో చూడాలి.