నాన్నగారు నా భుజం మీద చెయ్యి వేసి నవ్వడం నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్: మహేష్ బాబు

“నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద, ఒక్కొక్క జ్ణాపకానికి వందేళ్ళ ఆయువుందిగా.. ఇంకెన్ని ముందు వేచెనో అవ్వన్ని వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షి లాగా సాగదా” అని ఇవాళ విడుదలైన “ఇదే కదా నీ కథ” పాటలోని ఒక చరణం మహర్షి చిత్ర కథాంశాన్ని మాత్రమే కాదు మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటున్న శైలిని కూడా జస్టీఫై చేస్తుంది. అసలెప్పుడు తన ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు “మహర్షి” సినిమా కోసం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను చేసిన తప్పులను కూడా రియలైజ్ అవ్వడం, తప్పుల నుంచి తాను నేర్చుకున్న విషయాలను పంచుకోవడం ఒక వ్యక్తిగా మహేష్ లో ఎంతో పరిణితి వచ్చింది అనేందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

మే 9న విడుదలవుతున్న “మహర్షి” తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎంతో కాన్ఫిడెన్స్ తో మాటిచ్చిన మహేష్ మహర్షి గురించి, తన భవిష్యత్ చిత్రాల గురించి, తన కెరీర్ ప్లానింగ్ లో భార్య నమ్రత ప్రమేయం గురించి, తన ముద్దుల కూతురు సితార తన వ్యాక్స్ స్టేట్యూ చూసి ఇచ్చిన హానెస్ట్ ఎక్స్ ప్రెషన్ గురించి ఇలా చాలా విషయాలు మీడియాతో పంచుకొన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

నేను 40 నిమిషాల్లో విని ఒకే చేసిన కథ మహర్షి

నా ప్రతి సినిమా కథ నేను పూర్తిగా విని ఒప్పుకొన్నదే. కంగారుగానో లేక ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడూ ఆలోచించలేదు. స్పైడర్ సినిమా కూడా 20 నిమిషాల్లోనే ఒకే చేశాను. కథ నచ్చి వంశీ పైడిపల్లిని కొన్నాళ్లపాటు ఆగమన్నాను. ఆ కొన్నాళ్లు కాస్తా రెండేళ్లు అయ్యింది. లక్కీగా “మహర్షి” నా 25వ సినిమా అయ్యింది. వంశీ కథ చెప్పినప్పుడు కథలోని ఎమోషన్ & ఇంటెన్సిటీకి బాగా కనెక్ట్ అయ్యాను.

శ్రీమంతుడు షేడ్స్ ఉన్న మాట నిజమే కానీ..

టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినవాళ్ళందరూ శ్రీమంతుడు షేడ్స్ ఉన్నాయని కామెంట్ చేస్తుండడం నేను గమనించాను. నిజానికి సినిమాలో శ్రీమంతుడు షేడ్స్ ఉంటాయి కానీ.. అందుకు పర్ఫెక్ట్ రీజనింగ్ ఉంటుంది. సినిమా చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. చూశాక మీరే అంటారు ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎలాంటి పోలిక లేదని. శ్రీమంతుడు, భరత్ అనే నేను తర్వాత జనాల్లో ఆస్థాయి ఇంపాక్ట్ తీసుకొచ్చే సినిమా “మహర్షి”.

డిఫరెంట్ రోల్స్ రాకపోవడం నా తప్పు కాదు కదా..

నా సినిమాలన్నీట్లో గెటప్స్ ఒకేలా ఉంటున్నాయని నన్ను తెగ ట్రోల్ చేశారు. గెటప్ మార్చడం లేదని, హెయిర్ స్టైల్ మార్చడం లేదని రకరకాలుగా ట్రోల్ చేశారు. నాకు కూడా డిఫరెంట్ గెటప్స్ వేయాలని ఉంటుంది కానీ.. పాత్రతో సంబంధం లేకుండా డిఫరెంట్ గెటప్స్ వేయలేమ్ కదా. మహర్షిలో నేను మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాను. స్టూడెంట్, సి.ఈ.ఓ, రైతు. ఇలా మూడు వైవిధ్యమైన పాత్రల్లో మూడు భిన్న షేడ్స్ లో కనిపిస్తాను. నన్ను ట్రోల్ చేసినవాళ్లందరికీ ఈ సినిమాతో మంచి సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించడానికి చాలా భయపడ్డాను. కానీ.. వంశీ చాలా కన్విన్సింగ్ గా తెరకెక్కీంచాడు. సినిమాకీ ఆ కాలేజ్ ఎపిసోడ్ మొత్తం హైలైట్ గా నిలుస్తుంది.

పూరీ, సుకుమార్ల పేర్లు మర్చిపోవడానికి కారణమదే..

మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాధ్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుల పేర్లు కావాలని చెప్పాను అని తెగ న్యూసులు రాసేశారు. కానీ.. మేటర్ ఏంటంటే.. ఆ టైమ్ లో స్టేజ్ మీదకి కొందరు అభిమానులు వచ్చేయడంతో, ఆ కంగారులో వాళ్ళ పేర్లు మర్చిపోయానే కానీ.. వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. “ఒన్ నేనొక్కడినే” నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిమ్ మాత్రమే కాదు కల్ట్ సినిమా కూడా. సో, వంశీ నాకోసం వెయిట్ చేశాడని చెప్పడాన్ని సుకుమార్ కి పంచ్ అని కొందరు రాశారు. అలాంటి ఇంటెన్షన్ నాకు అస్సలు లేదు.

నా 25 ఏళ్ల సినిమా కెరీర్ లో అదే బెస్ట్ మూమెంట్..

నాకు నాన్నగారితో కలిసి నా సినిమాలు విడుదలైనప్పుడు ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడం చాలా ఇష్టం. అలా “మురారి” సినిమా నాన్నగారితో కలిసి చూసినప్పుడు.. సినిమా అయిపోయాక ఆయనేమీ మాట్లాడకుండా నా భుజం మీద చెయ్యేసి నవ్వడం నా కెరీర్ లోనే బెస్ట్ & మెమరబుల్ మూమెంట్.

ఇప్పట్నుంచి నా ఫ్యాన్స్ అందరూ మేలోనే సినిమాలు రిలీజ్ చేయమని అడుగుతారు..

మేలో విడుదలైన సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఏదో సెంటిమెంట్ ఉంది కానీ మే 9 అనేది చాలా స్పెషల్ డేట్. ఆ తేదీన విడుదలైన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. “మహర్షి” కూడా ఆ కోవలోకే చేరుతుంది. ఇప్పట్నుంచి నా ఫ్యాన్స్ అందరూ మే లోనే సినిమాలు రిలీజ్ చేయమని కోరతారు. ఎందుకంటే.. మహర్షి అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నాన్నగారు ఆల్రెడీ సినిమా చూశారు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు.

సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కారణం..

“రంగస్థలం” తర్వాత సుకుమార్ ఒక ఎంటర్ టైనింగ్ స్టోరీ చెప్తాడని ఊహించాను. కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న కథ చెప్పాడు సుకుమార్. నాకు కూడా ఒక మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథలో నటించాలని ఉంది. అందుకే సుకుమార్ కు బదులు అనిల్ రావిపూడి కథను ఎంచుకొన్నాను. ఈ విషయంలో సుకుమార్ తో విబేధాలేమీ రాలేదు. భవిష్యత్ లో సుకుమార్ తో కచ్చితంగా కలిసి పనిచేస్తాను.

అవన్నీ రూమర్లే..

నేను యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయనని, కొత్త దర్శకులు చెప్పే కథలు వినను అని రకరకాల రూమర్స్ ఉన్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు. నాకు కూడా కొత్త దర్శకులతో సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయాలని ఉంది. కానీ.. నాకు ఇప్పటివరకూ ఒక్క యంగ్ డైరెక్టర్ కూడా ఎగ్జైటింగ్ స్టోరీ చెప్పలేదు. కథ నచ్చాలే కానీ ఎవరితో వర్క్ చేయడానికైనా నేను రెడీ.

అలాంటి సినిమాలు చేయాలంటే భయం..

హిస్టారికల్ మూవీస్ చేయాలంటే నాకు చాలా భయం. అలాంటి కథలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న దర్శకులు దొరకాలి. సరైన కథాంశం కుదరాలి. అప్పుడు ఆ తరహా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పటివరకూ అలాంటి ఆలోచనలకు నేను చాలా దూరం.

నా థియేటర్లో నాకే టికెట్స్ లేవు అన్నారు..

ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూడాలని అనుకున్నాను కానీ.. ఏ.ఎం.బి సినిమాస్ లో రాత్రి 7 గంటల షోకి టికెట్స్ అడిగితే లేవు అన్నారు. రేపు గానీ ఎల్లుండి కానీ వేరే ఏదైనా షో టికెట్స్ సంపాదించి సినిమా చూడాలి.

సితార పాప షాక్ అయ్యింది..

నా వ్యాక్స్ స్టేట్యూ సేమ్ నాకు మల్లె ఉండడం చూసి మా అమ్మాయి సితార షాక్ అయ్యింది. ఒకేసారి ఇద్దరు మహేష్ లను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంలో ఆ నిమిషం కనిపించిన భావం వెలకట్టలేనిది. నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో అది ఒకటి.

నా ఫ్యాన్స్ లేకపోతే నేను లేను..

నా 20 ఏళ్ల కెరీర్ లో, నేను నటించిన 25 సినిమాలతో నాతోపాటు ట్రావెల్ చేసింది నా అభిమానులు. వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళకి ఎన్ని విధాలుగా, ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే.

ఇప్పటివరకూ మరో మల్టీస్టారర్ కథ రాలేదు..

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనంతరం నా దగ్గరకి మరో మల్టీస్టారర్ కథ రాలేదు. నాకు కూడా ఎన్టీఆర్-చరణ్ ల లాగా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ఉంది. మంచి దర్శకుడు, కథ సెట్ అయితే తప్పకుండా ఒక మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధం.

రాజమౌళితో సినిమా పక్కాగా ఉంటుంది..

రాజమౌళితో సినిమా ఉండడం ఖాయం. ప్రొడ్యూసర్ కూడా రెడీ. కానీ.. ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పట్లో చెప్పలేను. కుదిరితే అనిల్ రావిపూడితో సినిమా అనంతరం లేదా ఆయన ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసిన తర్వాత నాతో ఆయన సినిమా ఉంటుంది.

ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది..

ఒక అగ్ర కథానాయకుడిగా ఏడాదిలో నా సినిమాలు రెండు విడుదలైతే మార్కెట్ బాగుంటుందనే విషయం నాకు తెలుసు. కానీ.. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ను జనాలకి అందించాలంటే కనీసం 10 నెలల సమయం పడుతోంది. ఆ ప్రోడక్ట్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఇంకొంత సమయం పడుతుంది. అందువల్ల ఏడాదికి రెండు సినిమాలు చేయడం చాలా ఇబ్బందిగా మారింది.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus