మహేష్‌బాబుకి కొన్ని సెంటిమెంట్లు, విధానాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం, సినిమాలను బ్యాలెన్స్ చేసుకునేలా వాటిని తనకు తాను రాసుకున్నారు మహేష్. సినిమాలకు ఎంత సమయం కేటాయిస్తారో, కుటుంబానికీ అంతే సమయం కేటాయిస్తారు. అలా ఏదైనా సినిమాకు సంబంధించిన పనులు పూర్తయిన వెంటనే మహేష్ విదేశాలకు వెళ్తుంటారు. కుటుంబంతో సహా కొన్ని రోజులు గడిపి వచ్చి.. మళ్లీ కొత్త సినిమా పనులు ప్రారంభిస్తారు. అయితే ఈసారి మహేష్ అలా చేయడం లేదట.
టాలీవుడ్ హీరోలు కొంతమంది వరుసగా శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, తారక్ చిన్నపాటి సర్జరీలు జరిగాయి. త్వరలో మహేష్‌బాబుకు కూడా సర్జరీ చేస్తారట. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేష్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటారట. ఆ తర్వాత రెండు నెలలపాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారని సమాచారం. దీంతో ఈ ఏడాది మహేష్ టూర్‌కి వెళ్లరట. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తదితర కార్యక్రమాలు అయ్యాక మహేష్ సర్జరీ జరుగుతుందట.
ఆ వెంటనే రెండు నెలలు ఉంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటారు. అన్నీ ఓకే అనుకున్నాక త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందని సమాచారం. ఈలోపు త్రివిక్రమ్ ‘భీమ్లా నాయక్’ పనులు పూర్తి చేసి, మహేష్ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉంటారట.