మంచు మనోజ్ ఆదివారం సోషల్ మీడియాలో ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తిరుపతి ప్రజలతో ఉండి.. అక్కడి ప్రశాంతతని.. శక్తిని విస్తరింపజేస్తానని లేఖ ద్వారా చెప్పారు. అంతేకాదు.. “అక్కడి రైతులకు అండగా ఉంటాను.. వారి పిల్లలకు విద్యనందిస్తాను” అని కూడా వెల్లడించారు. ఈ లేఖ అనేక అనుమానాలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కొంతసమయమే ఉండడంతో రాజకీయంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది భావించారు. అలాగే ఆ లేఖపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వార్తలపై, కామెంట్స్ పై మంచు మనోజ్ స్పందించారు. నిన్న తిరుపతికి వెళ్లిన మనోజ్‌కు యూత్ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. దానికి సంబంధించిన పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఇలా కోరారు.
‘‘నాకెంతో ఘన స్వాగతం అందించి, నాపై అపారమైన ప్రేమను చూపించి నన్ను ఆశీర్వదించిన తిరుపతి ప్రజలకు నా ధన్యవాదాలు. నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజలకు నాదొక చిన్న విన్నపం. ప్రజలందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ధృడ నిశ్చయంతో, నా పూర్తి సంతృప్తితో చేస్తున్న ఈ పనికి రాజకీయ రంగులు పూయకండి. ఇక్కడ అన్నీ సెట్ కావాలి. 2019 మార్చిన జరిగే చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. భవిష్యత్‌లో మరింత బలాన్ని, సహాయాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమిస్తున్నా’’ అంటూ మనోజ్ లేఖ రూపంలో ట్వీట్ చేశారు. దీంతో మంచు మనోజ్ పై వస్తున్న గాసిప్స్ ఆగిపోయాయి.