‘‘మంచు కుటుంబంపై నెగిటివ్ మీమ్స్, నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ కంటెంట్ వస్తోంది. దీన్ని వెంటనే ఆపేయండి’’ అంటూ గత కొన్ని రోజులుగా మంచు విష్ణు ఈ మాటలు అంటూనే ఉన్నారు. ఆయన మాట్లాడినప్పుడు దీని గురించి చర్చ జరిగి, ఆ తర్వాత ఆగిపోతూ వస్తుంది. అయితే ఎందుకు, ఎవరు, ఎక్కడ, ఎప్పుడు చేస్తున్నారు అనేది క్లారిటీగా తెలియడం లేదు. విష్ణు కూడా అప్పుడప్పుడు అదిగో ఆయనే అని అంటున్నారు తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్సే చేశాడు.
‘జిన్నా’ సినిమాను దసరాకు విడుదల చేస్తామని చెప్పిన మంచు విష్ణు.. రీసెంట్గా సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా యూట్యూబర్లతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా తనపై, తన కుటుంబంపై వ్యతిరేక ప్రచారం, కామెంట్లు చేస్తున్న వారి గురించి మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో, యూట్యూబ్‌ల్లో టార్గెట్ చేసి రాసేవారిని వదిలిపెట్టను’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విష్ణు. ఈ సంద్భంగా గతంలో అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా తనపై వచ్చిన వ్యతిరేక ప్రచారం గురించి మరోసారి మాట్లాడాడు.
‘‘‘మా’ ఎన్నికల సమయంలో చాలామంది మీపై ట్రోల్స్ వస్తుంటే పట్టించుకోరేంటి అని అడిగారు. అయితే ఆ రోజుల్లో నేను ఎన్నికలపైనే దృష్టి పెట్టాను. అందుకే అప్పుడు వాటి గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ట్రోల్స్ చేసిన వారిపై పెట్టాను’’ అని చెప్పాడు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని కొంతమంది విమర్శించారు. దాని గురించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రమేయం తెలిసింది.
దాంతోపాటు ఓ ప్రముఖ నటుడి ఆఫీసుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు కూడా బయటపడ్డాయి’’ అని చెప్పాడు విష్ణు. అయితే ఈ విషయంలో మరి పోలీసులు కానీ, మంచు విష్ణు గానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయం చెప్పలేదు. ‘జిన్నా’ ప్రచారం కోసం విష్ణు మరికొద్ది రోజుల పాటు బయటకు వస్తారు. అప్పుడేమైనా చెబుతారేమో చూడాలి.