గత కొన్ని రోజులుగా వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తున్న ప్రముఖ గాయని మంగ్లీ (Mangli) మరోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాజా పరిణామాల నేపథ్యంలో చాలా నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటలీవల తన న్యాయవాదితో కలసి విలేకరులతో మాట్లాడారు మంగ్లీ. ఎక్కడ ఏం జరిగిందో విచారణ చేసుకోండి. నాకు పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదు అని ఎమోషనల్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే వాటిని ఎవరూ నమ్మకండి. కొందరి కామెంట్లు చూసి కుమిలిపోతున్నానని చెప్పారు.
నేను ఏదైనా తప్పు చేస్తే, ఎలాంటి విచారణకైనా సిద్ధం. నాపై వచ్చిన ఆరోపణలు నిరూపణ అయితే, జైలుకు వెళ్లడానికి కూడా నేను రెడీ. నేనూ పేదరికం నుండి వచ్చిన దాన్నే. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మాట్లాడారామె. గత నెల రోజుల నుంచి నా ప్రోగ్రామ్‌లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాపై కోపం ఉంటే వచ్చి నాతో మాట్లాడండి. ప్రజల్లో అనుమానం రేకెత్తించేలా ప్రవర్తించవద్దు. ప్రజలకు నన్ను దూరం చేయొద్దు. సంబంధం లేని విషయాల్లో నా ఫొటోలు దయచేసి వాడకండి అని కోరారామె.
బాధితులకు నేను అండగా ఉంటాను. నాపై దుష్ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నాను. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూసి మా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని కూడా మంగ్లీ చెప్పారు.
ఇంతకీ ఏమైందంటే.. మంగ్లీపై ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు వసూలు చేసి మోసం చేశారని, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. ఈ నేపథ్ంలో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.