Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

ప్రఖ్యాత బాఫ్టా అవార్డులకు రంగం సిద్ధమవుతోంది. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటిగా భావించే బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (బాఫ్టా) అవార్డుల నామినేషన్లలో ఈసారి మన దేశం నుండి ఓ సినిమా ఎంపికైంది. మణిపురికి చెందిన ‘బూంగ్‌’ అనే సినిమా నామినేట్‌ అయింది. బెస్ట్‌ చిల్డ్రన్స్‌ అండ్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌ విభాగంలో ‘బాఫ్టా’ పురస్కారానికి ఈ చిత్రం పోటీ పడుతోంది. ఈ మేరకు ఇటీవల నామినేట్‌ అయిన చిత్రాల జాబితా విడుదల చేశారు.

Boong

బాఫ్టా అవార్డుల్లో ఈ కేటగిరీలో వివిధ దేశాల నుంచి ‘అర్కో’, ‘లిలో అండ్‌ స్టిచ్’, ‘జూట్రోపొలిస్‌ 2’ లాంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘బూంగ్‌’ సినిమా గురించి చూస్తే.. బ్రోజేంద్ర అలియాస్‌ బూంగ్‌ అనే పాఠశాల విద్యార్థి చేసిన సాహసమే ఈ సినిమా కథాంశం. పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన బూంగ్ తండ్రి అనుకోకుండా అక్కడే ఉండిపోతాడు. ఎన్ని ఏళ్లు గడిచినా ఇంటికి తిరిగిరాడు. దీంతో తన తల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని పసిగట్టిన చిన్నారి.. ఎలాగైనా తన తండ్రిని తీసుకురావాలని అనుకుంటాడు.

దీని కోసం తన మిత్రుడితో కలసి తండ్రిని వెతకడానికి ఊరు వదిలి వెళతాడు. ఈ ప్రయాణంలో బూంగ్‌కి ఎదురైన సవాళ్లేంటి, బూంగ్‌ తన తండ్రిని కలిశాడా? లేదా అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాను లక్ష్మీప్రియ దేవి తెరకెక్కించారు. బాలీవుడ్‌ నటుడు ఫరాన్‌ అక్తర్‌ ఈ సినిమా నిర్మాత. టైటిల్‌ పాత్రలో గుగున్‌ కిప్జెన్‌ నటించాడు.

గతేడాది సెప్టెంబరులో మణిపురిలో విడుదలైన ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో ప్రదర్శితమైంది. పురస్కారాలు కూడా దక్కించుకుంది. ఇక ఫిబ్రవరి 22న లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మరి మన చిన్నారి ‘బూంగ్‌’ అవార్డు ముచ్చట తీరుస్తాడా అనేది చూడాలి.

నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags