మన్మధుడు 2

  • August 9, 2019 / 02:35 PM IST

విజయ భాస్కర్ దర్శకత్వంగా.. త్రివిక్రమ్ కథ-మాటలు అందించిన “మన్మధుడు” చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. ఆ సినిమాకి సీక్వెల్ గా కాకపోయినా.. అదే టైటిల్ తో రూపొందిన చిత్రం “మన్మధుడు 2”. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “మన్మధుడు” సినిమా ఫ్యాన్స్ తోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చిత్రం వారిని ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ: పోర్చుగల్ లో సెటిల్ అయిన స్వచ్ఛమైన తెలుగు కుటుంబంలోని ముఖ్యుడు సాంబశివరావు ఉరఫ్ సామ్ (నాగార్జున). తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి (కీర్తి సురేష్)ను తన కుటుంబం రిజెక్ట్ చేయడమే కాక.. ఆ అమ్మాయి కూడా తనను వదిలేసి వెళ్లిపోవడంతో.. పెళ్లి-ప్రేమ అనేవాటికి దూరంగా శృంగారం మాత్రమే ధ్యేయంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు.

ఒకానొక సందర్భంలో.. తల్లి (లక్ష్మీ) పెళ్లి చేసుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేయడంతో.. తన అసిస్టెంట్ (వెన్నెల కిషోర్) సహాయంతో అదే కంట్రీలో ఉంటూ రెస్టారెంట్ లో వెయిటర్ గా వర్క్ చేస్తున్న అవంతిక (రకుల్ ప్రీత్)ను పెయిడ్ ప్రియురాలిగా మాట్లాడుకొంటాడు సామ్.

అలా మొదలైన సామ్-అవంతికల జర్నీలో ఎదురైన ఆటుపోట్లు, సమస్యలు మరియు ఆరోగ్యవంతమైన ట్రెండీ కామెడీ సమ్మేళనమే “మన్మధుడు 2” చిత్రం.

నటీనటుల పనితీరు: నాగార్జున తన లుక్స్ తోనే టైటిల్ జస్టిఫికేషన్ చేసేసాడు. 17 ఏళ్ల క్రితం వచ్చిన “మన్మధుడు”లో ఎంత గ్లామరస్ గా ఉన్నాడో.. ఇప్పుడు వచ్చిన “మన్మధుడు 2″లోనూ అంతే గ్లామరస్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో నాగార్జున తన కుమారులు చైతన్య, అఖిల్ లకు రొమాంటిక్ సీన్స్ పరంగా గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పాలి.

అవంతిక పాత్రలో రకుల్ పిచ్చ గ్లామరస్ గా కనిపించి ఒక వర్గం ప్రేక్షకులను భీభత్సంగా ఆకట్టుకొంది. ఆమె క్యారెక్టరైజేషన్ కొత్తగా లేకపోయినా.. ఆమె పాత్రకు కథలో ఉన్న ఇంపార్టెన్స్ బాగుంది.

వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఆల్మోస్ట్ కిషోర్ కనబడిన ప్రతి సన్నివేశానికి జనాలు నవ్వుతూనే ఉంటారు. బ్రహ్మానందం కూడా ఒక సన్నివేశంలో కనిపించడం కొసమెరుపు. రావురమేష్ కూడా తన కామెడీ టైమింగ్ తో విశేషంగా ఆకట్టుకున్నాడు. లక్ష్మీ, ఝాన్సీ వంటి ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: చైతన్య భరద్వాజ్ పాటలు, నేపధ్య సంగీతం ట్రెండీగా మాత్రమే కాదు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఆ పాటల చిత్రీకరణ, ప్లేస్ మెంట్ కూడా బాగుంది. సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పోర్చుగల్ అందాలతోపాటు నటీనటులను కూడా చాలా కలర్ ఫుల్ గా చూపించాడు.

కిట్టు విస్సాప్రగడ సంభాషణలు అక్కడక్కడా కాస్త శృతి మించాయి అనిపిస్తుంది. నాగార్జున లాంటి సీనియర్ హీరో నుండి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేయం కాబట్టి అవి కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఐ డూ (2006) ఫ్రెంచ్ సినిమాను తెలుగీకరించే ప్రయత్నంలో అక్కడక్కడా కాస్త తడబడ్డాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది షష్టిపూర్తి (60 ఏళ్ల వయసు) జరుపుకోనున్న నాగార్జునతో కుర్రాళ్ళు చేసే రొమాన్స్ సీన్స్ లో నటింపజేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడించడం కాస్త ఇబ్బందికరంగా సాగింది. అలాగే.. రకుల్ & ఝాన్సీ రొమాంటిక్ కిస్ మిస్ ఫైర్ అయ్యింది. కామెడీ వరకు బాగానే వర్కవుట్ చేయగలిగాడు కానీ.. ఎమోషన్స్ విషయంలో తేలిపోయాడు రాహుల్. మొదటి సినిమా “చిలసౌ”లో చూపినంత పరిణితిని ఈ చిత్రం విషయంలో ప్రదర్శించలేకపోయాడు. మరి అగ్ర కథానాయకుడ్ని డైరెక్ట్ చేయాలన్న భయమో లేక కంగారో స్క్రీన్ ప్లే చాలా చోట్ల గందరగోళాన్ని క్రియేట్ చేస్తోంది.

విశ్లేషణ: “మన్మధుడు”తో కంపేర్ చేసుకోకుండా.. కాస్తంత అడల్ట్ జోక్స్ ను బేర్ చేయగలిగితే “మన్మధుడు 2” తప్పకుండా అలరిస్తుంది.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus