సాయిధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సొ బెటర్” థియేట్రికల్ రిలీజ్ తో మళ్ళీ మొదలైన థియేటర్లు అప్పట్నుంచి గ్యాప్ లేకుండా సినిమాలతో కళకళలాడుతూనే ఉన్నాయి. గత రెండు వారాలుగా అయితే ఏకంగా ఆరేడు సినిమాలు ఒకేరోజు విడుదలవుతూ “ఏ సినిమా చూడాలి?” అని సగటు ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తున్నాయి. ఫిబ్రవరి సంబడం ముగిసింది. ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో “క్రాక్, ఉప్పెన, జాంబీ రెడ్డి” హిట్స్ గా నిలవగా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి.
అయితే.. మార్చి నుంచి వరుస సినిమాలు సందడి చేయనున్నాయి. మార్చి 5న “ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీ ముబారక్, పవర్ ప్లే”, మార్చి 11కి “శ్రీకారం, గాలి సంపత్, జాతి రత్నాలు, రాబర్ట్”, మార్చి 19కి “చావు కబురు చల్లగా, మోసగాళ్ళు, శశికళ, ఇది మా కథ, ఓ మంచి రోజు చూసి చెప్తా”, మార్చి 26న “రంగ్ దే, అరణ్య”, మార్చి 27న “తెల్లవారితో గురువారం” ఇలా మార్చి మొత్తం 15 సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఈ 15 కాకుండా ఇంకో అయిదారు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ఇవి సరిపోవు అన్నట్లు ఓ నాలుగు స్ట్రయిట్ ఒటీటీ రిలీజులు కూడా ఉన్నాయి. ఏప్రిల్, మే ఎలాగో పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండడంతో.. మార్చిలోనే మీడియం బడ్జెట్ సినిమాలన్నీ విడుదలవ్వడానికి సిద్ధమైపోయాయి. వీటిలో ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్ అనేది తెలియదు కానీ.. కరోనా తర్వాత అత్యధిక మొత్తంలో వరుసబెట్టి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ చేస్తున్న ఏకైక ఫిలిమ్ ఇండస్ట్రీగా తెలుగు చిత్రసీమ సరికొత్త రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి.