వారానికి నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న తరుణంలో ఏదో సినిమా చూసామా, కాసేపు నవ్వుకున్నామా, ఇంటికెళ్లిపోయామా అన్నట్లు తయారైంది పరిస్థితి. ఏడాది మొత్తంలో మహా అయితే ఓ పది సినిమాలు సినిమాలు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలుగుతున్నాయి. అయితే.. ఎంటర్ టైన్ చేయడమే కాదు.. ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేసి 137 నిమిషాల పాటు ప్రేక్షకుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆలోచించేలా చేసిన చిత్రం “మర్ద్ కో దర్ద్ నహీ హోతా”. “ప్రేమ పావురాలు” ఫేమ్ భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దస్సాని కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి వసన్ బాల దర్శకుడు. ఇండియన్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం లాజిక్స్ తోపాటు కామెడీ & ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉండడంతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది.
ఇంత తక్కువ బడ్జెట్ తో ఒక సూపర్ హీరో మూవీ తీయడమే ప్రశంసనీయమైన అంశం అనుకుంటే.. క్యారెక్టర్స్ & క్యారెక్టరైజేషన్స్ తోనే కథనం మొత్తాన్ని నడిపించడం, నవ్వించడం కోసం సపరేట్ కామెడీ ట్రాక్, యాక్షన్ కోసం సపరేట్ ట్రాక్ అనేవి రాసుకోకుండా సినిమాని తీయడం అనేది హర్షణీయం. పుట్టిన నాలుగు ఏళ్లకే చనిపోతాడనుకున్న ఓ కుర్రాడు బ్రతకడమే కాక అసలు శరీరంలో నొప్పి అనేది తెలియకుండా పెరుగుతాడు. శరీరానికి నొప్పి తెలియకపోవడం అనేది అతడి రోగమే అయినప్పటికీ.. ఒకరకంగా వరంగా మారుతుంది. ఆ విచిత్రమైన రోగంతో అతడు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? తన గురువు మర్యాదను ఎలా కాపాడాడు అనేది కథాంశం. సో, డిఫరెంట్ మూవీస్ చూడాలి అనుకునేవారు మిస్ అవ్వకుండా ఈ క్రేజీ ఫిలిమ్ ను చూడండి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమా మొదలయ్యేది మన చిరంజీవి సాంగ్ & రిఫరెన్స్ తో. సో స్టార్టింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.