Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Cast & Crew

  • ఆది పినిశెట్టి, చైతన్య రావు (Hero)
  • తాన్య రవిచంద్రన్ (Heroine)
  • సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, దివ్య దత్త, శత్రు, నాజర్ (Cast)
  • దేవకట్టా - కిరణ్ జయ్ కుమార్ (Director)
  • విజయ్ కృష్ణ లింగమనేని - శ్రీహర్ష (Producer)
  • శక్తికాంత్ కార్తీక్ (Music)
  • సురేష్ రఘుటు - జ్ఞానశేఖర్ (Cinematography)
  • ప్రవీణ్ కేఎల్ (Editor)
  • Release Date : ఆగస్ట్ 07, 2025
  • హిట్ మెన్ & ప్రొడోస్ ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి (Banner)

వెబ్ సిరీస్ లకు తెలుగులోనూ మంచి ఆదరణ పెరుగుతుంది. మొన్నామధ్య వచ్చిన ఒరిజినల్ తెలుగు సిరీస్ “బృంద” ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పెద్దల జీవితాలు లేదా వారి పర్సనాలిటీ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ “మయసభ”. దేవకట్టా తెరకెక్కించిన ఈ 9 ఎపిసోడ్ల సిరీస్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!!

Mayasabha Web-Series Review

కథ: కులం కంటే మనిషికి ఎక్కువ విలువ ఇవ్వాలని తపించే కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి), కులాన్ని కాపాడుకుంటూనే ప్రజాసేవ చేయాల్ని ప్రయత్నించే ఎం.ఎస్.ఆర్ (చైతన్య రావు) ఒకానొక సందర్భంలో కలిసి ప్రయాణించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం రాజకీయ ప్రత్యర్థులుగా మారేలా తెర తీసిన సందర్భాలు ఏమిటి? వాటిని వాళ్లు ఎలా అధిగమించారు? అనేది ఈ సిరీస్ కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రతి ఒక్క నటుడు తాను పోషించిన పాత్రలో ఒదిగిపోయినప్పటికీ.. అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంది మాత్రం చైతన్య రావు. అతడి ఫిజికల్ అప్పీరియన్స్ మొదలుకొని భాష, యాస అన్నీ చాలా ఆర్గానిక్ గా ఉన్నాయి. పాత్రలోని ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా పండించాడు. ఆది పినిశెట్టి ఈ సిరీస్ కోసం ఫిజికల్ గా కంటే మెంటల్ గా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాడు అనిపిస్తుంది. పాత్రలో నట్టి స్వభావాన్ని పండించడం కోసం అతడు పడిన శ్రమ కనిపిస్తుంది. అలాగే.. పాత్రలో వచ్చే గర్వాన్ని, ధ్యేయ సాధన కోసం చేసే పోరాటాన్ని కూడా చాలా చక్కగా పండించాడు.

సాయికుమార్ నటన మరో హైలైట్ అని చెప్పాలి. ఆయన పర్సనాలిటీ కంటే వాయిస్ మేజర్ రోల్ ప్లే చేసింది. తాన్య రవిచంద్రన్ మంచి ఆరోగ్యకరమైన గ్లామర్ ను యాడ్ చేయగా.. దివ్య దత్త పాత్ర సిరీస్ కి మంచి వెల్యూ యాడ్ చేసింది. వీళ్లందరికంటే విశేషంగా ఆకట్టుకున్న నటుడు మాత్రం శివారెడ్డి పాత్ర పోషించిన శంకర్ మహంతి స్క్రీన్ మొత్తాన్ని తన నటనతో ఆక్రమించేశాడు. అతడు కనిపించే సన్నివేశాలు కొన్నే అయినా ఆయన మాత్రం చాలాకాలం గుర్తుండిపోతాడు.

నాజర్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు పాత్రలను పెద్దగా ఎక్స్ ప్లోర్ చేయలేదు. బహుశా సెకండ్ సీజన్ లో ఉండొచ్చు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా ఆశ్చర్యపరిచిన సిరీస్ ఇది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా సహజంగా ఉన్నాయి. టీమ్ అంతా మంచి రీసెర్చ్ చేసి, ఎక్కడా అసహజత్వం లేకుండా జాగ్రత్తపడ్డారు.

శక్తికాంత్ బీజేయంలో వచ్చే “సహోదర” మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఎడిట్ ప్యాటర్న్ కూడా డీసెంట్ గా ఉంది. అలాగే AI ని వినియోగించినా ఎక్కడా వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ ను పాడుచేయలేదు. ట్రైన్ ఎపిసోడ్స్ కి AIని చాలా తెలివిగా వినియోగించారు. టైటిల్ కార్డ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ వర్క్ పైన పేర్కొన్న టెక్నికాలిటీస్ అన్నిటినీ కాంప్లిమెంట్ చేసేలా ఉంది. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు అయినప్పటికీ ఎక్కడా కూడా లైటింగ్ డిఫరెన్సులు లేకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే.. క్యారెక్టర్ ఆర్క్స్ ను మెటాఫర్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.

దర్శకరచయితలు దేవకట్టా & కిరణ్ లు సీజన్ 1 వరకు సేఫ్ గేమ్ ఆడారనే చెప్పాలి. దేవకట్ట ముందే చెప్పినట్లుగా సిరీస్ లో సందర్భాలను మాత్రమే ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా నాటకీయతను ఇనుమడించాడు. అందువల్ల కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఈ సిరీస్ లో చాలా లొసుగులు కనిపిస్తాయి. కానీ.. రాజకీయ సమీకరణలతో సంబంధం లేకుండా ఒక సిరీస్ గా చూస్తే మాత్రం కొన్ని డాట్స్ ను కనెక్ట్ చేసుకుంటూ, పాత్రల స్వభావాలను ఆస్వాదిస్తూ చూసేలా డిజైన్ చేశాడు దర్శకద్వయం. కచ్చితంగా పొలిటికల్ గా రచ్చ లేపే లేదా ట్రోల్ అయ్యే సన్నివేశాలు, సందర్భాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ.. కథాపరంగా మాత్రం చాలా చోట్ల ఆశ్చర్యపరుస్తుంది. అయితే.. ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా మారే సందర్భాన్ని ఇంకాస్త విశదీకరించి వివరిస్తే బాగుండేది అనిపిస్తుంది. మరి సెకండ్ సీజన్ లో దాని తాలుకు సన్నివేశాలు ఏమైనా ఉంటాయేమో చూడాలి. అలాగే.. సెకండ్ సీజన్ కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి పొలిటికల్ సిరీస్ ఇవ్వడంలో దేవకట్టా & కిరణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

విశ్లేషణ: సినిమాగా తీయడానికి కుదరని లేదా ఇబ్బందిపడే కథలను సిరీస్ ల రూపంలో ప్రేక్షకులకు అందించడం అనేది మంచి పరిణామం. హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ను ఇప్పుడు టాలీవుడ్ అడాప్ట్ చేసుకుంటుంది. అందులో తొలి ప్రయత్నమే “మయసభ” అని చెప్పొచ్చు. ఇదే కథను సినిమాగా తీస్తే సెన్సార్ కత్తెరలోనే సగం కథ నలిగిపోయేది. అందులోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఎప్పుడూ నెగిటివ్ గా చూడడమే తప్ప వాటి మొదలు ఎక్కడ అని ప్రస్తావించిన సినిమాలు, కథలు చాలా తక్కువ. అందుకే “మయసభ” మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ముందు చెప్పినట్లుగా.. రెండు రకాల ఓపీనియన్స్ వస్తాయి ఈ సిరీస్ విషయంలో. అవి ఎంత డ్యామేజ్ చేస్తాయి అనేది పక్కన పెడితే.. పబ్లిసిటీకి మాత్రం బాగా ఉపయోగపడతాయి. అందువల్ల నిజనిర్ధారణలు పక్కన పెట్టగలిగితే ఈ 9 ఎపిసోడ్ల సిరీస్ ను హ్యాపీగా వీకెండ్ కి సోనీ లైవ్ యాప్ లో బింజ్ వాచ్ చేయొచ్చు.

ఫోకస్ పాయింట్: రాజకీయ రణరంగానికి తెరలేపిన మయసభ!

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus