హీరో నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ “మీట్ క్యూట్”. అయిదు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతోంది. విడుదలైన ట్రైలర్ మంచి అంచనాలు నమోదు చేసింది. మరి ఈ సిరీస్ ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: అయిదు ఎపిసోడ్లు.. అయిదు సందర్భాలు.. అయిదు కథలు.
1. మీట్ ది బోయ్
తల్లి కుదిర్చిన పెళ్ళిచూపులకు ఇష్టం లేకుండా వెళ్తుంది వర్ష బొల్లమ్మ. అబ్బాయిని కలిశాక ఆమె మనసు ఎలా మారింది? అనేది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో ఎక్కడా సహజత్వం అనేది లేకపోవడం పెద్ద మైనస్. అనవసరమైన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మరీ ఎక్కువ టైమ్ వేస్ట్ చేయడంతో.. కథ సాగదు. అందువల్ల.. కథనం బోర్ కొట్టి ఎపిసోడ్ ఎప్పుడైపోతుందా? అని ఆలోచిస్తూ ఉంటాం.
2. ఓల్డ్ ఈజ్ గోల్డ్
ఇది కూడా ఇంచుమించి మొదటి ఎపిసోడ్ లానే ఉంటుంది. చాలా ప్రెడిక్టబుల్ గా సాగుతూ ఉంటుంది. సహజత్వం కొరవడడంతో.. కథనం బోర్ కొడుతుంది. సత్యరాజ్ మొదటిసారి నటించడానికి కష్టపడినట్లుగా కనిపిస్తుంది. రుహానీ శర్మ, రాజాలు పర్వాలేదనిపించుకున్నారు.
3. ఇన్ లా లవ్
సిరీస్ మొత్తంలో కంటెంట్ ఉన్న ఎపిసోడ్ ఇదొక్కటే.. సిరీస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనుకునే టైంలో ఈ ఎపిసోడ్ సిరీస్ ను స్కిప్ చేయకుండా చేసింది. రోహిణి, ఆకాంక్ష సింగ్ ల నటన, ఎపిసోడ్ లో సింగిల్ ఉమెన్ లైఫ్ ను అద్భుతంగా ఎలివేట్ చేసిన విధానం ఆకట్టుకుంటాయి.
4. స్టార్ స్ట్రక్
సందర్భం సింపుల్ గా ఉన్నా.. మరీ ఎక్కువగా సాగింది అనిపిస్తుంది. అదా శర్మ, శివ కందుకూరి చక్కగా నటించినప్పటికీ.. ఈ తరహా కథనం ఇదివరకే చూసి ఉండడంతో కొత్తదనం కనిపించదు.
5. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్
సిరీస్ మొత్తం వీకేస్ట్ ఎపిసోడ్ ఇదే. మొదలైనప్పుడు పర్వాలేదు అనిపించినా.. ఎండింగ్ మాత్రం విసుగుతెప్పిస్తుంది. ఎంత ప్రేమ గురించి వివరించినప్పటికీ.. ఇంకా దెయ్యాలు, ఆత్మలతో ప్రేమ వివరాలు చెప్పించడం, అది కూడా సరైన జస్టిఫికేషన్ లేకుండా అనేది దారుణమైన విషయం.
సాంకేతికవర్గం పనితీరు: విజయ్ బుల్గానిన్ సంగీతం ఈ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రఫీ & ప్రొడక్షన్ వర్క్ సోసోగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా టెక్నికాలిటీస్ ఒక ఒటీటీ వెబ్ సిరీస్ కు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకురాలు దీప్తి గంటా ఎంచుకున్న సందర్భాలు బాగున్నప్పటికీ.. ఆ సందర్భాల చుట్టూ అల్లుకున్న కథనం ఆకట్టుకునే విధంగా లేదు.
ముఖ్యంగా సహజత్వం లోపించింది. ఒక్క మూడో ఎపిసోడ్ తప్ప ఎందులోనూ సహజత్వం కనిపించకపోవడం పెద్ద మైనస్. అలాగే.. ఎమోషన్స్ అనేవి చాలా ఫోర్స్డ్ గా ఉండడం కూడా ఈ సిరీస్ కి మైనస్. సో, దర్శకురాలిగా, కథకురాలిగా దీప్తి గంటా విజయం సాధించలేకపోయిందనే చెప్పాలి.
విశ్లేషణ: ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి.. ఒటీటీలో కాస్త ఓపికతో చూడదగిన సిరీస్ “మీట్ క్యూట్”. టైటిల్లో & ట్రైలర్లో ఉన్న క్యూట్ నెస్ సిరీస్ లో లేకపోవడమే మైనస్.
రేటింగ్: 2/5