మన హీరోలు డాన్స్ నెంబర్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. మొత్తం ఆల్బమ్ లో కనీసం బీట్ ఉన్న పాట ఒక్కటైనా ఉండేలా చూసుకుంటారు. ఆ పాటతోనే తమ డాన్సింగ్ టాలెంట్ ను చూపించాలని తాపత్రయపడుతుంటారు. ఇక మెగాహీరోలైతే కచ్చితంగా ఒక మాస్ సాంగ్ తో అలరిస్తుంటారు. అందరూ డాన్స్ లలో ఆరితేరిన వాళ్లే. బన్నీ, చరణ్ ఇలా మెగాహీరోలంతా తమ డాన్స్ లతో ఎంటర్టైన్ చేస్తుంటారు. అయితే వైష్ణవ్ తేజ్ లోని డాన్సింగ్ టాలెంట్ ను చూసే అవకాశం మాత్రం ఇప్పటివరకు రాలేదు.
ఆయన డెబ్యూ ఫిల్మ్ ‘ఉప్పెన’లో డాన్సింగ్ నెంబర్లు లేవు. ‘కొండపొలం’లో కూడా అంతే.. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో కూడా అలాంటి పాట లేదు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ అంటే అందులో కచ్చితంగా ఒక మాస్ బీట్ ఉంటుంది. కానీ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో మాత్రం అలాంటి సాంగ్ కనిపించలేదు. నిజానికి సెకండ్ హాఫ్ లో దేవి మార్క్ సాంగ్ ఒకటి ఉందట.
అది విన్న వైష్ణవ్ తేజ్.. ఆ పాటకు తగినట్లుగా డాన్స్ చేయలేనని.. ఆ పాట తీసేద్దామని చెప్పారట. దీంతో రికార్డింగ్ చేసిన పాటను పక్కన పెట్టేశారట. వైష్ణవ్ నటుడిగా ప్రేక్షకులను మెప్పించగలిగారు. కానీ డాన్స్ లలో ఇంకా అంత పెర్ఫెక్షన్ లేదట. దానిపై సాధన చేయాల్సివుంది. మెగా హీరో నుంచి వస్తోన్న మాస్ సాంగ్ అంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. యావరేజ్ స్టెప్పులతో కానిచ్చేస్తే ట్రోలింగ్ కి గురవ్వడం ఖాయం.
అందుకే డాన్స్ లలో మరింత శిక్షణ తీసుకున్న తరువాతే వెండితెరపై అలాంటి ప్రయత్నాలు చేస్తానని అంటున్నారు వైష్ణవ్. తన నెక్స్ట్ సినిమాలోనైనా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే మాస్ బీట్స్ ఉంటాయేమో చూడాలి!