పుకార్లు నిజమయ్యాయి… ఎన్నో ఏళ్లుగా మెగా అభిమనులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. అలా మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఆణిముత్యం చేరింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రదానం చేసే పద్మ పురస్కారాల్లో ఈ ఏడాది చిరంజీవికి పద్మ విభూషణ్ వస్తుంది అని పుకార్లు వచ్చాయి. గత కొన్ని రోజులుగా వచ్చిన పుకార్లకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రకటించారు.
2024 ఏడాదికిగాను చిరుకు ‘పద్మవిభూషణ్’ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మెగా కుటుంబంలో, మెగాభిమానులు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో చిరంజీవిని గౌరవించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘పద్మవిభూషణ్’ పురస్కారం దక్కింది. సినిమా కళామ్మతల్లికి ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
చిరంజీవి సుమారు 45 ఏళ్లుగా తెలుగు సినిమా తెరపై బలమైన ముద్ర వేశారు. రకరకాల పాత్రలు, కథలతో అలరిస్తూ వస్తున్నారు. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. బ్లడ్ బ్యాంకు, ఐబ్యాంకుతో పాటు కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకు, కరోనా ఛారిటబుల్ ట్రస్ట్ లాంటివి ఏర్పాటు చేసి సేవలు చేశారు. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలోనూ స్పందించి సాయం అందిస్తున్నారు.
ఇక ఈ అవార్డు రావడం పట్ల చిరంజీవి స్పందించారు. ‘‘పద్మవిభూషణ్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీ అన్నయ్యగా, మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా భావించి కోట్లాది మంది ఇస్తున్న ఆశీస్సులు.. నా సినీ కుటుంబం అండదండలు.. అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. అందుకే నాకు దక్కిన ఈ గౌరవం మీది. నా పై ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానులకు నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది’’ అని అన్నారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!