మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ నెల 28న అనంతపురంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ముంబైలో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయాలనేది చిరంజీవి ఆలోచన. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సల్మాన్ డేట్స్ చూసుకొని ముంబైలో ఓ ఈవెంట్ ను నిర్వహించాలనుకుంటున్నారు.
ఈ నెల 30 లేదా 31న ముంబైలో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరగనుంది. మరోపక్క ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నయనతారను తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా అయితే నయన్ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. తను సినిమా సైన్ చేసినప్పుడే ప్రమోషన్స్ కి రానని చెప్పేస్తుంది. ఇప్పటివరకు ఆమె సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా కనిపించింది లేదు. ‘సైరా’ ప్రమోషన్స్ లో కూడా ఆమె కనిపించలేదు.
అయితే ‘గాడ్ ఫాదర్’ కోసం ఆమెని తీసుకురావాలని చూస్తున్నారు. ఈ విషయమై నయనతారతో సంప్రదింపులు జరుపుతున్నారు మేకర్స్. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి! ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మలయాళంలో రిలీజ్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో చిత్రబృందంపై విమర్శలు వస్తున్నాయి.
ఎందుకంటే.. ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా తెరకెక్కించారు. అక్కడ మోహన్ లాల్ లీడ్ రోల్ పోషించారు. సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటిది ఇప్పుడు ఆ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ని మలయాళంలో రిలీజ్ చేయాలనుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.