మెరిసే మెరిసే రివ్యూ & రేటింగ్!

  • August 6, 2021 / 06:56 PM IST

‘హుషారు’ మూవీతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న దినేష్ తేజ్.. సోలో హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెరిసే మెరిసే’. శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ కె. దర్శకత్వం వహించాడు.ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ప్రోమోస్, సాంగ్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. దాంతో మొదటి నుండీ ఈ మూవీ పై పాజిటివ్ బజ్ ఉంది.

ఓ ఫ్రెష్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కినట్టు ట్రైలర్ ఆశలు రేపింది. మరి ప్రోమోస్, ట్రైలర్స్ ఉన్న స్థాయిలో సినిమాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేము. మరి ‘మెరిసే మెరిసే’ కూడా ఆ కోవకి చెందినదేనా?లేక మెరుపులు ఏమైనా మెరిపించిందా? అనే విషయాన్ని తెలుసుకుందాం రండి :

కథ: సిద్దూ(హీరో దినేష్‌ తేజ్‌) బాగా సెటిల్ అయిన ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. కాకపోతే సొంతంగా తన కాళ్ళ పై తను నిలబడాలనుకునే ఆశయం కలిగిన వాడు. ఈ క్రమంలో బెంగుళూర్ లో ఓ స్టార్టప్ సాఫ్ట్ వేర్ కంపెనీని మొదలుపెడతాడు.అయితే అనుకోని విధంగా అతను తయారు చేయాలనుకున్న యాప్ ఫెయిల్ అవుతుంది.ఈ క్రమంలో తన వల్ల ఏమీ కాదు అనే డిప్రెషన్ కు గురవుతాడు. కొడుకు బాధను చూసి తట్టుకోలేక.. సిద్దూ తల్లిదండ్రులు అతన్ని కొంతకాలం హైదరాబాద్‌కు పంపి కోలుకునేలా చేయాలనుకుంటారు.

మరోపక్క….వెన్నెల(శ్వేతా అవస్థి) అనే అమ్మాయికి ఫ్యాషన్ డిజైనర్ గా రాణించాలని కోరిక. కానీ అనుకోకుండా ఈమకి లండన్‌లో డాక్టర్‌గా పనిచేసే హరీష్‌తో నిశ్చితార్ధం అవుతుంది.తనకి కాబోయే భర్తకి అలాగే అత్తగారికి ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయడం నచ్చదు.అయితే పెళ్లికి అలాగే విదేశాలకు వెళ్ళడానికి వీసా ప్రాసెస్ కు 8 నెలల టైం ఉండడంతో ఈమె హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యి…

పెళ్లయ్యే లోపు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో రాణించాలని తాపత్రయపడుతుంది. ఈ క్రమంలో వెన్నెలకి … సిద్దూ పరిచయం అవుతాడు.వారి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది..! వెన్నెలతో పరిచయం,ప్రేమ సిద్ధూ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి. చివరికి వెన్నెలకి పెళ్ళైపోయిందా? అనే విషయాలు మనం తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు: సిద్ధు పాత్రలో దినేష్ నటన బాగానే ఉంది.’హుషారు’ లో కూడా ఇంచు మించు ఇలాంటి పాత్రనే పోషించాడు కాబట్టి… అతను ఎంతో ఈజ్ తో చేసేసాడు.అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో ఇతను ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. వెన్నెల పాత్రలో చేసిన శ్వేతా అవస్తి కూడా లుక్స్ తో అలాగే నటనతో ఆకట్టుకుంది.ఈమె కూడా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకా పరిణితి చెందాలి.

అలా అయితే భవిష్యత్తులో ఈమెకు పెద్ద సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించిన కాటలిన్ గౌడ ఉన్నంతలో ఓకే అనిపించింది. శశాంక్ మండూరి, సంజయ్ స్వరూప్, గురురాజ్, బిందు, సంధ్యా జనక్, మణి, నానాజీ వంటి వారు మనం ఎక్కువగా చూసే నటీనటులు కాకపోవడం వలన సినిమా చూసి బయటకి వచ్చే టైములో మనకు వాళ్ళు గుర్తుండరు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు పవన్ కుమార్ తాను అనుకున్న పాయింట్ ను బాగానే తెరకెక్కించాడు కానీ.. మరీ ఫ్లాట్ గా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పై ఇతను ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుణ్ణు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ ను ఇతను టేకప్ చేసిన విధానం బాగుంది. సంభాషణలు కూడా బాగానే ఉన్నాయి. యువతకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఉన్నాయని చెప్పొచ్చు.

నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ హైలైట్ అని చెప్పొచ్చు. కార్తిక్ కొడగంగ్ల సంగీతంలో రూపొందిన పాటలు తెరపై బాగున్నాయి.నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు.‘కనులతో రచించు కావ్యాలలో… ‘ అనే పాట వెంటనే రిజిస్టర్ అయ్యేలా ఉంది. మహేశ్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు రిచ్ గా లేకపోయినా.. సినిమా కథకి తగినట్టు ఉన్నాయి. అనవసరమైన ఖర్చుల జోలికి నిర్మాత పోలేదు అనిపిస్తుంది.

విశ్లేషణ: అక్కడక్కడా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఆనంద్’ సినిమా ఛాయలు కనిపిస్తాయి.పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన ప్రాధాన్యత ఉండాలనే అంశాన్ని అతను సున్నితంగా డీల్ చేసాడు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు పెట్టి ఇరికించారు అనే భావన కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ ఆ ఫీల్ ను పోగొడుతుంది అనడంలో సందేహం లేదు.

నటీనటుల మొహాలు ఎక్కువగా చూసినవి కాదు కాబట్టి.. అదో వెలితిలా అనిపిస్తుంది.అయితే మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాము లేదా టైం పాస్ మూవీ చూసాము అనే భావన తప్పకుండ ఈ ‘మెరిసే మెరిసే’ కలిగిస్తుంది. నిస్సందేహంగా ఒకసారి అయితే చూడొచ్చు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus